Radha Krishna vs KTR: కొన్ని విషయాలను చెప్పడంలో.. కొన్ని నిజాలను మొహమాటం లేకుండా వెల్లడించడంలో ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ స్టైల్ వేరు.. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. వైయస్ జగన్ ను విమర్శించాల్సిన పని లేకుంటే.. రాధాకృష్ణ తన పత్రికలో రాసే కొత్త పలుకు హైదరాబాద్ దమ్ బిర్యాని లాగా ఉంటుంది.
ఒకవేళ చంద్రబాబు ప్రస్తావన వచ్చి.. జగన్ ను కనక తిట్టాల్సి వస్తే రాధాకృష్ణ ఒక్కసారిగా లైన్ తప్పుతాడు. అతడి లో ఉన్న పాత్రికేయుడు మాయమైపోతాడు. ఓ పార్టీకి అనుకూలమైన కార్యకర్త తెర ముందు కనిపిస్తాడు. అప్పుడు వాస్తవాలు పక్కదారికి వెళ్తాయి. టార్గెట్ అంశాలు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తాయి.. అయితే తాజాగా రాసిన కొత్త పలుకులో చంద్రబాబు ప్రస్తావన లేదు. జగన్ గురించి విమర్శ లేదు. స్థూలంగా తెలంగాణ గురించి మాత్రమే రాధాకృష్ణ ఫోకస్ చేశాడు. రేవంత్ రెడ్డికి ఎదురైన అనుభవాలు.. రేవంత్ రెడ్డి చవిచూస్తున్న పరిస్థితులను ఏకరువు పెట్టాడు. అంతేకాదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఫోన్ ను వారి ఆధీనంలోకి తీసుకున్న విధానం.. తను మాట్లాడిన మాటలను విన్న విధానం గురించి ఆర్కే కుండ బద్దలు కొట్టాడు.
Also Read: స్వేచ్ఛకు గతంలోనే రెండు వివాహాలు.. పూర్ణచందర్ సంచలన లేఖ వైరల్
తెలంగాణ గురించి ఆర్కే ప్రస్తావించిన విషయాల్లో సంచలనంగా అనిపించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తీరు.. అధిష్టానం కలగజేసుకున్న విధానం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి అందిన చోట అప్పులు తీసుకొచ్చారట. ఎలాగైనా సరే కెసిఆర్ ను ఢీకొట్టడానికి ఆయన రంగంలోకి దిగారట. విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా ఆయన వ్యవహరించారట. చివరికి తన జీవిత కాల సాఫల్యాన్ని సాధించారట. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విషయంలో తాత్సారం ప్రదర్శించిందట. అంతేకాదు కొంతమంది సీనియర్ నాయకులను కావాలని తెరపైకి తీసుకువచ్చిందట. అంతేకాదు తను చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం సూచించిందట. వారి శాఖలలో వేలు పెట్టకూడదని ముఖ్యమంత్రికి సరిహద్దులు నిర్ణయించిందట.
అధిష్టానం తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డిని ఇబ్బందికి గురిచేసిందట. చివరికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దక్కకుండా చేసిందట. ఫలితంగా చాలా సందర్భాలలో రేవంత్ ఢిల్లీలోనే ఉండి పోవాల్సి వచ్చిందట.. పైగా కొంతమంది అసంతృప్త నాయకుల మాటలు విని ఏకంగా రేవంత్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించాలని అనుకుందట. అయితే దీనిపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవడానికి అధిష్టానం ఫోన్లు చేయగా.. వారంతా కూడా రేవంత్ నాయకత్వానికి జై కొట్టారట.. దీంతో నాయకత్వం మార్పు లేకుండా అధిష్టానం నిశ్శబ్దంగా ఉండి పోయిందట.
వాస్తవానికి ఇలాంటి విషయాలు రాయాలంటే కాస్త దమ్ము ఉండాలి. పైగా ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని మార్చే అవకాశం ఉందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు ద్వారా తెలంగాణ సమాజానికి ఈ విషయం తెలిసింది. ఒక కోణంలో చూస్తే అధిష్టానం మీద సగటు తెలంగాణ ఓటర్ కు ఆగ్రహం రావడం ఖాయం. ఇదే సమయంలో ఇదే కొత్త పలుకును భారత రాష్ట్ర సమితి నెగటివ్ గా ప్రచారం చేయడం కూడా ఖాయమే. రాధాకృష్ణ రాసిన ఇంత విశ్లేషణ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో క్లారిటీ వచ్చింది.. ఆ పార్టీ అధిష్టానం ఇలానే ఉంటే ఇప్పుడే కాదు ఇంకా కొన్ని దశాబ్దాల వరకు కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు..
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకృష్ణ పాత చింతకాయ పచ్చడిని ముందు వేసుకున్నప్పటికీ.. తన ఫోన్ కాల్స్ విన్న విధానం.. తనను నక్సలైట్ అనుకూల వ్యక్తిగా భావించడం.. తను మాట్లాడిన మాటలను దొంగ చాటుగా వినడం వంటి విషయాలను రాధాకృష్ణ ఓపెన్ గా చెప్పేశాడు. తను ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాను.. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎలా ఇబ్బంది పడ్డాను అనే విషయాలపై కూడా రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. మొత్తంగా చూస్తే వచ్చే టర్ములో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు అనధికారికంగా హింట్ ఇచ్చాడు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అతిపెద్ద సపోర్టుగా నిలబడ్డాడు రాధాకృష్ణ. బహుశా వచ్చే ఎన్నికల్లో కూడా అంతకుమించి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాధాకృష్ణకు ఇప్పుడు కెసిఆర్ కుటుంబంతో వైరం కొనసాగుతోంది.