Game Changer Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా నేడు రాజమండ్రి లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సమయం తక్కువ ఉండడం వల్ల రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు వంటి వారు తమ ప్రసంగాలను చాలా తొందరగా ముగించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువసేపు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు మెగా అభిమానులను కంటతడి పెట్టేలా చేసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన స్పీచ్ లోని ముఖ్యంశాలను ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాం.
ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య చాలా మంది టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అని అంటున్నారు. నాకు అది అసలు నచ్చడం లేదు. అన్ని ఇండస్ట్రీ లను కలిపి భారతీయ సినీ పరిశ్రమ అని పిలవడమే మన నినాదం గా ఉండాలి. హాలీవుడ్ మేకర్స్ పద్దతులను మనం ఎలాగో అనుసరించము, కానీ ఈ వాళ్ళ లాగా ‘వుడ్’ అని ప్రతీ భాషకి తగిలిస్తాము. మన భారత జాతి ప్రాముఖ్యతను ప్రపంచం మొత్తం తెలిసేలా చేసే సినిమాలు చేయాలి’ అంటూ ఆయన చాలా బావోద్వేగంగా మాట్లాడాడు. సినిమా టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతూ ‘సినిమా టికెట్ రేట్స్ కోసం హీరోలు ఎందుకు ప్రభుత్వం దగ్గరకు రావాలి?, నిర్మాతలు వస్తే సరిపోతుంది. టికెట్ రేట్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ స్థాయి వ్యక్తులు రావాల్సిన అవసరం లేదు. అలాంటి సంస్కృతికి మా కూటమి ప్రభుత్వం పూర్తిగా విరుద్ధం. అంత తక్కువ స్థాయికి మేము దిగజారలేము’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతీసారి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఇచ్చే గౌరవం వేరు. ఎల్లప్పుడూ ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటాడు’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. టికెట్ రేట్స్ గురించి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఈ టికెట్ రేట్స్ మేము ఊరికే ఇవ్వడం లేదు, దీని వల్ల మాకు టాక్సులు లభిస్తున్నాయి. వాటిని మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నాము, తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు వసూళ్ల పరంగా హాలీవుడ్ తో పోటీ పడే రేంజ్ కి ఎదిగింది. ఆ పరిశ్రమ ఇంకా పైకి ఎదగడానికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.