Immigration Into Congress: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా నడుస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఏ మాత్రం తగ్గకుండా పోట్లాడుకుంటున్నారు. ఏ మాత్రం చాన్స్ దొరికినా వదలకుండా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూనే ఉంది. వారి విమర్శలకు తగినట్లుగా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. గత 11 నెలలుగా ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పాలిటిక్స్ నడుస్తుండడాన్ని చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రేవంత్, కేటీఆర్ మధ్య మాటలయుద్ధం రోజురోజుకూ రాజుకుంటోంది.
రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొలువుదీరింది. ఆ పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా చేసింది. పార్టీని పూర్తిగా ఖాళీ చేసేసింది. సీనియర్ లీడర్లందరినీ తన పార్టీలోకి లాగేసింది. దాంతో ఆ పదేళ్లు కాంగ్రెస్ పార్టీ కీలక కేడర్ కూడా చాలా ఇబ్బందులు పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ అయినప్పటికీ.. రాష్ట్రంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇదే అదునుగా తీసుకున్న బీఆర్ఎస్ ఆ పార్టీని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఖాళీ చేసేసింది.
కట్ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. పదేళ్ల తరువాత ఆ పార్టీ అధికారం చేపట్టింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో కొలువుదీరి 11 నెలలు అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ పంచాన చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పకపోయినప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిలం అన్నట్లుగా ప్రవర్తించింది. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్పీకర్ స్పందించకపోవడంతో ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు.
గత కొద్ది నెలలుగా ఈ కేసు విషయమై హైకోర్టులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు నిన్న హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో సంబురాలు వెల్లువెత్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం అనేది పూర్తిగా స్పీకర్ నిర్ణయాధికారం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు చర్యలు తీసుకోవాలనేది కూడా స్పీకర్ ఇష్టమేనని పేర్కొంది. దీంతో ఈ తీర్పు కాస్త బీఆర్ఎస్‌కు చెంపపెట్టులా తయారైంది. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలను ఎవరు కూడా టచ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారట. ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కూడా మాట్లాడుతూ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ ఉన్నారని వివరించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం.. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు భారీగానే చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.