IND Vs AUS BGT 2024: పెర్త్ వేదిక జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఇప్పటికైతే 151 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన భారత జట్టు.. ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కడపటి వార్తలు అందే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 105 పరుగులు చేసింది. టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (54) హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఆటగాడు కేఎల్ రాహుల్(42) పరుగులు చేశాడు. అతడు హాఫ్ సెంచరీకి చేరువవుతున్నాడు.. అయితే ఆస్ట్రేలియా జట్టును తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ చేయడంలో బుమ్రా తనదైన చాకచక్యాన్ని ప్రదర్శించాడు.. ఐదు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టును తీవ్రమైన ఇబ్బందుల్లోకి నట్టాడు.. జట్టు 150 పరుగులు చేసినప్పటికీ… ఆస్ట్రేలియాను 104 పరుగులకు చాప చుట్టేలా చేయడంలో విజయవంతమయ్యాడు.
అదే అతడిలో ప్రత్యేకం
ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేయడంలో కీలక భూమిక పోషించిన బుమ్రా.. జట్టు ఆటగాళ్లల్లో స్ఫూర్తి నింపడంలో విజయవంతం అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ సంఘటన ఇప్పుడు సామాజిక మధ్యమాలలో ప్రస్తావనకు వస్తోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బుమ్రా బౌలింగ్లో ప్రమాదకరమైన లబూ షేన్ క్యాచ్ ను విరాట్ కోహ్లీ జారవిడిచాడు. చేతిలోకి వచ్చిన బంతిని అందుకోలేక విఫలమయ్యాడు. బుమ్రా స్థానంలో మరొకరు ఉన్నా రాద్ధాంతం చేసేవారు. కానీ బుమ్రా అలా చేయలేదు. పైగా చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. అదే నిబద్ధతతో అతడు బౌలింగ్ వేసాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ క్రమంలో బుమ్రా పై అభినందనల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నాడు..” బుమ్రా ప్రవర్తించిన తీరు నన్ను ఆకట్టుకుంది. 10 ఓవర్లలోనే ప్రత్యర్థులను అతడు కట్టడి చేశాడు. తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. కెప్టెన్ గా ఉండడంతో మరింత నిబద్దతతో బౌలింగ్ వేశాడు. అప్పటికే అతడు ఒక వికెట్ పడగొట్టాడు. లబూ షేన్ వికెట్ తీసే అవకాశం చేజారిపోయినప్పుడు బాధపడలేదు. సానుకూల దృక్పథంతో వికెట్లను పడగొడతాననే అర్థం వచ్చేలా చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీనీ, స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరి, కమిన్స్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. గత కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న బుమ్రా.. పెర్త్ మైదానంలో మాత్రం చెలరేగిపోయాడు. మైదానంపై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలవలేకపోయారు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ పూర్తిగా చేతులెత్తేశారు.