Telangana Govt Jobs :తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను విస్మరించింది. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఇంటికో ఉద్యోగం విషయాన్ని విస్మరించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దీంతో నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్‌రెడ్డి.. 2023 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచింది. మరో రెండు నెలలైతే ఏడాది పూర్తవుతుంది. కానీ, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫకేషన్ల ఉద్యోగాల పరీక్షలు, గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటి ఫలితాలు ప్రకటించి ఎల్‌బీ స్టేడియం వేదికగా నియామకపత్రాలు అందిస్తూ తామే భర్తీ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ సొంతగా ఇచ్చిన నోటిఫకేషన్ డీఎస్సీ, ఇటీవల మెడికల్, ఫార్మసీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఇంతలోనే నోటిఫకేషన్ల జారీ నిలిపివేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కారణం ఇదే..
తెలంగాణలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఆమేనరకు రాష్ట్రంలో ఎన్సీ వర్గీకరణఱ అమలుకు ఏకసభ్య కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చూడాలని సూచించారు. కమిషన్ నివేదిక సమర్పించే వరకు అంటే రెండు నెలలు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉండని స్పష్టం చేశారు. ఏక సభ్య కమిషన్ నివేదిక తర్వాతనే ఆ నివేదికకు అనుగుణంగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని ప్రకటించారు.
కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సమీక్ష..
తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం(అక్టోబర్ 9న) సమీక్ష నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు తమకు అందిన వినతులతోపాటు, పంజాబ్, తమిళనాడులో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో తీసుకుంటున్న చర్యలను మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ అధ్యయనం చేస్తారని వివరించారు, వర్గీకరణ తర్వాత న్యాయపరమైన చిక్కులు రాకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక ఇస్తుందని ప్రకటించారు. అన్ని విభాగాల నుంచి ఏకసభ్య కమిషన్‌కు అవసరమైనసమాచారం ఇవ్వాలని ఆదేశించారు. వినతుల స్వీకరణకు వీలుగా కమిషన్ ఉమ్మడి జిల్లాలో ఒక రోజు పర్యటించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
2 లక్షల ఉద్యోగాల భర్తీ ఉట్టిమాటే…
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ పేరిట మొక్కుబడిగా విడుదల చేశారు. ఇక తాజాగా ఎస్సీ వర్గీకరణ పేరుతో కొత్త నోటిఫికేషన్లకు బ్రేక్ వేశారు. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.