Journalist Life: కాలంతో సంబంధం ఉండదు. కుటుంబంతో సంబంధం ఉండదు. బాధను వ్యక్తం చేయకూడదు. ఆనందాన్ని పంచుకోకూడదు. సంతోషాన్ని షేర్ చేసుకోకూడదు. రోబో లాగా ఉండాలి. పని చేయడాన్నే అలవర్చుకోవాలి. పనిలోనే బతుకుతూ ఉండాలి. అనారోగ్యానికి గురైనా పట్టించుకోకూడదు. రోగాలు ఇబ్బంది పెడుతున్నా పరుగు ఆపకూడదు. ఒక రకంగా యంత్రం లాగా పని చేయాలి. యంత్రంలాగే ఆలోచించాలి.. ఎందుకంటే ఆధునిక కాలంలో ఒక జర్నలిస్టు పరిస్థితి ఇలానే మారిపోయింది.
Also Read: 99 వద్ద రూట్ ఆగిపోయాడు.. జడేజా అంటే అలా ఉంటది మరి.. వైరల్ వీడియో
వేతనాలు గొప్పగా ఉండవు. చెప్పుకునే స్థాయిలో ఆస్తులు ఉండవు. పని చేయించుకునే మేనేజ్మెంట్ సహకరించదు. కష్టకాలంలో ఆదుకోదు. ఏ ప్రకారం చూసుకున్నా ఇదొక ఉద్యోగమని.. ఇది భరోసా ఇస్తుందని భావించకూడదు. ప్రతిరోజు దిన దిన గండం లాగానే ఉండాలి. ఏదో కొంతమందికి పై స్థాయి పరిచయాలు ఉంటాయి. పై స్థాయిలో అండదండలు లభిస్తుంటాయి. ఆదాయం కూడా అందుతూ ఉంటుంది. కానీ మిగతా వారికి అలా ఉండదు. అలా ఉండే అవకాశం దక్కదు. గొడ్డు చాకిరి మాత్రమే చేయాలి. ఎటువంటి ప్రయోజనాలు మేనేజ్మెంట్ నుంచి ఆశించకూడదు. ఆశించి భంగపడకూడదు.
కరోనా సమయంలో ఎంతోమంది పాత్రికేయులను మేనేజ్మెంట్లు మెడపట్టి బయటికి గెంటేశాయి. మీ చావు మీరు చావండి అంటూ వెళ్ళగొట్టాయి. కరోనా సమయంలో మీడియా ఉద్యోగం ఎంత దరిద్రమైనదో చాలామందికి అనుభవంలోకి వచ్చింది. అలా రోడ్డు మీద పడ్డ పాత్రికేయులు చాలామంది అవస్థలు పడ్డారు. కుటుంబాలను సాకలేక నరకం చూశారు. చివరికి వేరే వ్యాపకాలు చూసుకున్నారు. ఇన్నాళ్లపాటు జర్నలిజంలో కొనసాగినందుకు తమను తామే తిట్టుకున్నారు. చివరికి రియలైజ్ అయిపోయి.. వేరే రంగాలలో స్థిరపడ్డారు.. మీడియాలో ఉన్న వారికి కూడా అంత గొప్పగా వేతనాలు లేవు. ముఖ్యంగా ఫీల్డ్ లెవల్లో పనిచేసే సిబ్బంది జీతాలు దారుణంగా ఉన్నాయి. ఫీల్ లెవెల్ లో పనిచేసే సిబ్బంది మీద ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. అర్ధాంతరంగా కన్నుమూస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటు వల్ల ముగ్గురు పాత్రికేయులు కన్నుమూశారు. తాజాగా సిరిసిల్లలో ఓ ఛానల్ లో పనిచేసే రిపోర్టర్ కన్నుమూశాడు.
గుండెపోటు రావడంతో ఆ ఛానల్ రిపోర్టర్ హఠాత్తుగా చనిపోయాడు. అతడికి ముగ్గురు పిల్లలు. అతడు ఉండేది సిరిసిల్ల పట్టణంలో కిరాయి ఇంట్లో. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఆ రిపోర్టర్ ఇంతవరకు వెనకేసింది లేదు. సొంత ఇల్లు లేదు. సొంత ఊర్లో జాగ కూడా లేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. శవానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు… ” కొడుకా మాముందే చనిపోయావు. ఒక రూపాయి కూడా సంపాదించలేదు. పూలదండల కోసం సంపాదించుకున్నవరా .. నీ పిల్లలు ఏం కావాలి.. మమ్మల్ని కాటికి పంపిస్తావనుకుంటే.. మా కళ్ళ ముందే నిన్ను కాటికి పంపించినం కొడకా” అంటూ ఆ రిపోర్టర్ తల్లి రోదించడం అందర్నీ కన్నీరు పెట్టించింది..
వాస్తవానికి ఇలాంటప్పుడే అనిపిస్తుంది. జర్నలిజం అనేది పనికిమాలిన వృత్తి అని.. దిక్కుమాలిన కెరియర్ అని.. జర్నలిజం అనే ఊబిలో దిగిన వారు బయటకు రాలేరు. బయటికి వచ్చే ప్రయత్నం కూడా చేయరు. అలాంటప్పుడు వారిని నమ్ముకున్న కుటుంబాలు ఆగమవుతాయి. చివరికి అర్ధాంతరంగా ఇలా చనిపోతే రూపాయి కూడా లేక నరకం చూస్తాయి. సాధ్యమైనంతవరకు ఈ కెరియర్ వదిలిపెడితేనే బతుకు బాగుంటుంది. మిగతా కుటుంబ సభ్యులకు కూడా భరోసా లభిస్తుంది. లేకుంటే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది. కేవలం సిరిసిల్ల రిపోర్టర్ పరిస్థితి మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాత్రికేయుల అందరి దుస్థితి దాదాపు ఇలానే ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోవు. యాజమాన్యాలు కనికరించవు. దీనిని బాండెడ్ లేబర్ అనాలి. స్థూలంగా మన పరిభాషలో చెప్పాలంటే పైసలు సంపాదించలేని వెట్టిచాకిరి..