HomeNewsIsrael-Hamas war: ఇక యుద్ధమే.. రంగంలోకి ఇజ్రాయిల్.. ఏం జరగబోతోంది?

Israel-Hamas war: ఇక యుద్ధమే.. రంగంలోకి ఇజ్రాయిల్.. ఏం జరగబోతోంది?

Israel-Palestine war: హమాస్, ఐడీఎఫ్‌ (ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్) మధ్య పోరు కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ అంతర్గత భద్రత చట్టంలోని సెక్షన్‌ 40 ప్రకారం.. పరిస్థితులను శనివారం ‘యుద్ధ స్థితి’గా పేర్కొన్న ప్రభుత్వం.. ఆదివారం యుద్ధాన్ని ప్రకటించడంతో.. సోమవారం నుంచి గాజాపై భీకర దాడులు ఉంటాయని స్పష్టమవుతోంది. సరిహద్దుల్లోని పౌరులను తరలించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులను, ఫైటర్‌జెట్లను మోహరించడంతో.. సోమవారం ఏదైనా జరగొచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. 1973 తర్వాత ఇజ్రాయెల్‌ రెండోసారి ‘యుద్ధ స్థితి’ని ప్రకటించడం గమనార్హం.

16 చోట్ల భీకర పోరు

గాజాస్ట్రిప్-ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో 16 చోట్ల హమాస్‌ ఉగ్రవాదులకు, తమకు మధ్య భీకర పోరు సాగుతున్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) ఆదివారం మధ్యాహ్నం వెల్లడించింది. ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో నక్కిన హమాస్‌ ఉగ్రవాదులను చాలా వరకు మట్టుబెట్టినట్లు ప్రకటించడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నామని పేర్కొన్నారు. ‘‘సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో ఇంకా ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. ఓఫకిమ్‌, సదెరాత్‌, యాద్‌మోర్దేచాయ్‌, కిఫర్‌ అజా, బీరీ, యాతిద్‌, కిసుఫిమ్‌లో ఉగ్రవాదులతో మా సేనలు భీకరంగా పోరాడుతున్నాయి. ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ఐడీఎఫ్‌ మోహరించింది’’ అని ఆయన వివరించడం విశేషం. కాగా.. హమాస్‌ దాడుల్లో శని, ఆదివారాల్లో తమ పౌరులు, అధికారులు 700 మంది వరకు మృతిచెందినట్లు, 2 వేల మందికి పైగా గాయడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో 10మంది నేపాలీలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌లోని నేపాల్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు చెందిన 45 మంది అమర సైనికులు, అధికారుల ఫొటోలు, పేర్లను ఐడీఎఫ్‌ వెల్లడించింది. ఈ రెండ్రోజుల్లో 2 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారని, వారిలో రెండొందల మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు గాజాస్ట్రిప్ లోని ఓ మసీదు నుంచి ఇజ్రాయెల్‌కు భారీ భూగర్భ సొరంగం ఉన్నట్లు గుర్తించి, దాన్ని ధ్వంసం చేసినట్లు సైన్యం ప్రకటించింది. అటు జికిమ్‌ బీచ్‌ వద్ద హమాస్ చెందిన ఐదు నౌకలను పేల్చేశామని, చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను నిర్బంధించామని పేర్కొంది.

గాజా గజగజ..

ఇజ్రాయెల్‌ ప్రతిదాడితో గాజా గజగజలాడుతోంది. గైడెడ్‌ మిసైల్స్‌, రాకెట్‌ దాడులతో గాజాలోని భవంతులు పేకమేడల్లా కూలిపోతున్నాయి. శనివారం పాలస్తీనా టవర్‌ కుప్పకూలగా.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 810 లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది. 13 ఆకాశహార్మ్యాలు, 30 భారీ భవనాలు, ఇతర బిల్డింగ్‌లు నేలకూలాయి. వీటిల్లో వతన్‌టవర్‌, అల్‌-అక్లౌక్‌ టవర్‌, మాతర్‌ సముదాయం ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులతో 400 మంది పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ పేర్కొంది.

లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా దాడులు

హమాస్ లకు మద్దతుగా గాజా స్ట్రిప్‌ నుంచి శనివారం సాయంత్రం ర్యాలీగా ఇజ్రాయెల్‌ వైపు వచ్చిన హిజ్బుల్లా ఉగ్రవాదులను ఐడీఎఫ్‌ మట్టుబెట్టింది. దీంతో.. హిజ్బుల్లా ఉగ్రవాదులు ఆదివారం ఉదయం లెబనాన్‌ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు చేశారు. తమ డిఫెన్స్‌ వ్యవస్థలు ఆ మిసైల్స్‌, రాకెట్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగాయని ఐడీఎఫ్‌ వెల్లడించింది. కాగా, సోమవారం అక్కడ ఏమైనా జరగొచ్చు అనే సంకితాలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దృష్టి మొత్తం ఇజ్రాయిల్,హమాస్ పైనే కేంద్రీకృతమై ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular