Hamas: అత్యంత శక్తిమంతమైన మిలటరీ, నిఘా వ్యవస్థతోపాటు.. సాంకేతికంగా బలంగా ఉన్న ఇజ్రాయెల్‌పై.. హమాస్ దాడి వెనక అజ్ఞాత శక్తులున్నాయా? ఇజ్రాయెల్‌కే చుక్కలు చూపేలా రాకెట్ల దాడి చేసిన హమాస్ కు అంతటి ఆయుధ సంపత్తి ఎక్కడిది? ఏకే-47లు, ఆటోమేటెడ్ మెషీన్ గన్లను రష్యానే సరఫరా చేసిందా? ఈ ప్రశ్నలకు “రాబర్ట్ లాన్సింగ్ ఇన్‌స్టిట్యూట్” రష్యా సహకారంపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నాటో దళాల దృష్టిని రష్యా-ఉక్రెయిన్ పోరు నుంచి ఇజ్రాయెల్ యుద్ధం వైపు మళ్లించేందుకు కుయుక్తులకు పాల్పడిందనే ఆరోపణలు అమెరికా సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి హమాస్ మూకలు ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలను సమకూర్చుకునే అవకాశాలున్నాయి. అయితే.. శనివారం ఉదయం ఇజ్రాయిల్‌పై ఏడు వేల దాకా రాకెట్లను ప్రయోగించాయి. వేల సంఖ్యలో వారికి రాకెట్లు, గైడెడ్ క్షిపణులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు రష్యా సహకారం కచ్చితంగా ఉండేఉంటుందని అమెరికా సంస్థలు చెబుతున్నాయి. అంతేకాదు..! హమాస్ లు పారాగ్లైడర్ల ద్వారా ఇజ్రాయిల్ లోకి చొచ్చుకువచ్చారు. ఇప్పటికే రష్యా వద్ద పారాగ్లైడర్స్ దళాలున్నాయి. హమాస్ వాడిన పారాగ్లైడర్స్‌తో వీటికి సారూప్యతలున్నాయి. అరబ్ దేశాలపై పట్టుకోసం రష్యా ఇప్పటికే ఈ ప్రాంతాల్లో చురుగ్గా ఉండడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోంది. సిరియా పౌరయుద్ధంతోపాటు ఇతర యుద్ధాల్లోనూ రష్యా నేరుగా జోక్యం చేసుకొంది.
ఉక్రెయిన్ యుద్ధంలో హమాస్ సాయం
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా పాలస్తీనా, లెబనాన్ యువత సాయం తీసుకుంది. వీరికి 350 డాలర్ల(సుమారు రూ.30 వేల) అలవెన్స్ ఇచ్చింది. దీనికి ప్రతిగానే హమాస్ సేనలకు మాస్కో నుంచి మద్దతు లభించినట్లు అమెరికా సంస్థలు అనుమానిస్తున్నాయి. హమాస్ కు మద్దతివ్వడం వల్ల రష్యాకు కూడా లాభం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దళాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను సమకూరుస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య రక్షణ ఒప్పందం ఉన్న నేపథ్యంలో అగ్రరాజ్యంతోపాటు.. నాటో సాయం ఇజ్రాయెల్‌కు అందే అవకాశాలున్నాయి. దాంతో.. ఉక్రెయిన్‌ను ఒంటరిని చేసేలా రష్యా ఎత్తులు వేసిందని అనుమానిస్తున్నారు. అంటే.. ఉక్రెయిన్‌కు అందే ఆయుధ సాయాన్ని ఇజ్రాయెల్‌కు మళ్లించేలా చేయడం రష్యా వ్యూహంగా తెలుస్తోందని చెబుతున్నారు. మరోవైపు పుతిన్ కూడా తాజా యుద్ధంపై స్పందిస్తూ.. ఇరుపక్షాలు శాంతిని నెలకొల్పాలని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఒప్పందం దిశగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
బలం చేకూరుస్తున్న వాగ్నర్
శనివారం ఉదయం నుంచే ఇజ్రాయెల్‌పై హమాస్ ల దాడులు ప్రారంభమైనా.. పాలస్తీనా వైపు నుంచి మీడియాకు ఎలాంటి సమాచారం అందలేదు. శనివారం మధ్యాహ్నం నుంచి వాగ్నర్ మీడియా వింగ్ ‘గ్రే జోన్’ ఆ బాధ్యతలను భుజాలకెత్తుకుంది. తన టెలిగ్రామ్ చానల్‌లో హమాస్ కు అనుకూల పోస్టింగ్‌లను ప్రారంభించింది. ‘‘ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని అమాయకులు చనిపోతున్నారు’’ అంటూ గగ్గోలు పెట్టింది. ఇజ్రాయిల్ దాడిలో గాజాలోని భవంతులు కూలిపోతున్న దృశ్యాలను నాలుగు వైపుల నుంచి చిత్రీకరించి.. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇజ్రాయిల్ సైనికులను హమాస్ సేనలు హతమార్చడాన్ని కూడా అప్‌లోడ్ చేస్తోంది. అంతవేగంగా ‘గ్రే జోన్’ వీడియోలను పోస్ట్ చేయడాన్ని బట్టి.. మాస్కో మద్దతుతోనే వాగ్నర్ సేనలు హమాస్ కు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలను బట్టి రష్యా ఉక్రెయిన్ దేశంపై యుద్ధాన్ని అంత సులువుగా మొదలుపెట్టలేదని, దీని తెర వెనుక భారీ కసరత్తు చేసిందని తెలుస్తోంది. హమాస్ ఉదంతం దీనిని బలపరుస్తోంది.