Jagan: పవన్ ( Pawan Kalyan)విషయంలో జగన్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతున్నారా? పవన్ కళ్యాణ్ విమర్శించడం లాభం కంటే నష్టం చేకూరుస్తుందా? టిడిపి, జనసేన బంధాన్ని మరింత దృఢం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన ఒకేసారి ఆవిర్భవించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది. జనసేన అందుకోసం వెయిట్ చేసింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారి ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీది సుదీర్ఘ చరిత్ర. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి చేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో కొన్ని వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాయి. అది తెలిసి కూడా మరోసారి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తుండడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
Also Read: పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్ నరేందర్ రెడ్డి ఎందుకు ఓడాడు?
* వారిద్దరును దగ్గర చేసింది జగనే..
పవన్ కళ్యాణ్ ను తిట్టడం ద్వారానే జనసేన ను టిడిపికి దగ్గర చేశారు జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). పైగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడంతో మెగా అభిమానులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం సైతం దూరమైంది. ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి అదేపనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన విశ్లేషణలతో కొంత మౌనం దాల్చారు. పవన్ పై విమర్శలు చేయడానికి సాహసించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అవి విధానపరంగా ఉండటంతో పర్వాలేదు. పైగా అధికార పార్టీ కావడంతో వచ్చే నష్టం కూడా లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్రమత్తంగా ఉండకపోతే నష్టం తప్పదు.
* రెండు పార్టీల మధ్య ఐక్యత
ప్రస్తుతం టిడిపి,జనసేన మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంది. గ్రౌండ్ లెవెల్ లో విభేదాలు ప్రారంభమైనట్లు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. ఆ రెండు పార్టీల మధ్య ఐక్యతకు ఆయన కారణం అవుతారు. ఇలా పవన్ పై జగన్ విమర్శలు చేశారో లేదో లోకేష్ ఎంటర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తద్వారా జనసేన పార్టీ శ్రేణుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఆ రెండు పార్టీల మధ్య మరింత బంధాన్ని దృఢం చేస్తాయి.
* ఆ సామాజిక వర్గం దూరం
మరోవైపు కాపు సామాజిక వర్గం( kapu community ) ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహంగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఆ వర్గం నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీకి దూరం జరిగిపోతున్నారు. కేవలం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడిని కాపు సామాజిక వర్గం సహించలేకపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే పని చేస్తుండడంతో ఆ వర్గం ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిచేరే ఛాన్స్ కనిపించడం లేదు. ఇటువంటి స్వయం తప్పిదాలకు పాల్పడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పట్టు దొరకడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఏపీలో నియోజకవర్గాల పెంపు.. కీలక ప్రతిపాదనలతో ఢిల్లీకి చంద్రబాబు!