CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఎన్డీఏ లో కీలక భాగస్వామి. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించింది తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. గత రెండుసార్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవు. ఏపీ రాజకీయాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలోనే అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. కానీ ఈసారి ఏపీ నుంచి గెలిచిన ఎంపీల అవసరం ఉండడంతో కేంద్రం అన్ని విధాల స్పందిస్తోంది. చంద్రబాబు విన్నపాలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపుతోంది. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే విశాఖలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మరోవైపు ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయానికి సైతం శంకుస్థాపనలు పూర్తి చేశారు.
Also Read: వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. రంగన్న ఆకస్మిక మృతి!
* చంద్రబాబు రెండు రోజుల పర్యటన
తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు( Delhi tour ) వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబుకు విమానాశ్రయంలో ఎంపీలు స్వాగతం పలికారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. అక్కడ అమిత్ షా తో గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చించారు. మరోవైపు రాజకీయపరమైన అంశాలు సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
* కీలక సూచనలు..
ప్రధానంగా నియోజకవర్గాల పెంపు విషయంలో చంద్రబాబు( Chandrababu) కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏపీ నుంచి మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంది. విభజన హామీల్లో భాగంగా నియోజకవర్గాలు పెంచాలన్న డిమాండ్ ఉంది. అయితే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాలను అటు ఉంచితే.. అసెంబ్లీ నియోజకవర్గాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఈ నియోజకవర్గాల విభజన జరుగుతుంది. ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రిని చంద్రబాబు ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
* నియోజకవర్గాల పెంపు..
ఉమ్మడి ఏపీలో ( combined Andhra Pradesh)294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేవి. విభజన నేపథ్యంలో తెలంగాణకు 117 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు వచ్చాయి. అయితే పునర్విభజనతో ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాలు పెరిగితేనే రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే పరిస్థితి ఉంది. అందుకే చంద్రబాబు ప్రత్యేక విన్నపం పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేలా పునర్విభజన ప్రక్రియ ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
* కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ..
మరోవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను( Nirmala sitaraman ) కలిశారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక కేటాయింపులపై చర్చించారు. పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత చంద్రబాబు విశాఖకు తిరిగి వచ్చినట్లు సమాచారం. ఈరోజు విశాఖలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ఓ పుస్తకావిష్కరణకు చంద్రబాబు హాజరుకానున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మళ్లీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రాజకీయ, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు ఢిల్లీ టూర్ సాగుతోంది.
Also Read: నాగబాబుకు ఎమ్మెల్సీ.. కేఏ పాల్ ఆగ్రహం.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు