Honda: మన ఇండియాలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి. కానీ ఒక ‘మేడ్ ఇన్ ఇండియా’ స్కూటర్ మాత్రం విదేశాల్లో బాగా అమ్ముడవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి మొత్తం 5.69 లక్షల స్కూటర్లు ఎగుమతి కాగా, అందులో కేవలం హోండాకు చెందిన ఒకే ఒక స్కూటర్ 1.43 లక్షల యూనిట్లు విదేశాలకు వెళ్లాయి.
ఆ స్కూటర్ ఇంకేదో కాదు.. Honda Navi. దీని మొత్తం ఎగుమతులు 1,43,583 యూనిట్లు. ఇది ఇండియా నుంచి ఎగుమతి అయిన మొత్తం స్కూటర్లలో 25 శాతం. దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న టాప్-10 స్కూటర్లలో హోండాకు చెందిన 3 స్కూటర్లు ఉన్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి 5,69,093 స్కూటర్లు ఎగుమతి అయ్యాయి. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ. అప్పుడు దేశం నుంచి 5,12,347 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. దేశంలో స్కూటర్లను ఎగుమతి చేసే అతిపెద్ద కంపెనీ హోండా. హోండా నావితో సహా కంపెనీ మొత్తం 3,11,977 యూనిట్లను ఎగుమతి చేసింది. దీని తర్వాత టీవీఎస్ మోటార్ 90,405 స్కూటర్లను, యామహా మోటార్ ఇండియా 69,383 యూనిట్లను ఎగుమతి చేసింది.
వీటితో పాటు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, హీరో మోటోకార్ప్, పియాజియో (వెస్పా), ఏథర్ ఎనర్జీ మరియు బజాజ్ ఆటో కూడా దేశంలోని టాప్ స్కూటర్ ఎగుమతిదారులలో ఉన్నాయి.
దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యే స్కూటర్ హోండా నావి. దీని ఎగుమతులు 1,15,886 యూనిట్ల నుంచి 24 శాతం పెరిగి 1,43,583 యూనిట్లకు చేరాయి. హోండా డియో ఎగుమతులు కూడా 91 శాతం పెరిగాయి. ఇది 66,690 యూనిట్ల నుంచి 1,27,366 యూనిట్లకు పెరిగింది. వీటితో పాటు మూడో స్థానంలో యామహా రే ఉంది. దీని ఎగుమతులు 40,605 యూనిట్ల నుంచి 68,231 యూనిట్లకు పెరిగాయి.
ఇవే కాకుండా టాప్-10 ‘మేడ్ ఇన్ ఇండియా’ స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ నాలుగో స్థానంలో, హోండా యాక్టివా ఐదో స్థానంలో, సుజుకి బర్గ్‌మన్ ఆరో స్థానంలో, టీవీఎస్ జూపిటర్ ఏడో స్థానంలో, హీరో మాస్ట్రో ఎనిమిదో స్థానంలో, సుజుకి ఎవెనిస్ తొమ్మిదో స్థానంలో, హీరో జూమ్ పదో స్థానంలో ఉన్నాయి.