మత సామరస్యం-హిందూత్వానికి సవాళ్లు (భాగం9)

జాగృత హిందూ సమాజ చారిత్రక నేపధ్యం  పోయినభాగం లో హిందూ సమాజం ఎలా జాగృతమయ్యిందో, అధికారాన్ని ఎలా సుస్థిర పరుచుకుందో చూసాం. అదేసమయం లో ఇది పూల బాటే కాదు ఎన్నో అవరోధాలు పొంచిఉన్నాయనేది దృష్టి లో వుంచుకోవాలనేది ఈ భాగం సారాంశం. దాదాపు 1300 ఏళ్ళు మెజారిటీ హిందువులు ప్రధాన భూభాగం లో ఇతరుల ప్రభుత్వాల్లోనే వుండాల్సివచ్చింది. దీనికి కారణాలు అనేకం. భారతదేశం ఆధ్యాత్మికంగా ఒకదేశమైనా పరిపాలనా పరంగా అనేక రాజులు, రాజ్యాలుగా ఉండటంతో పశ్చిమ […]

Written By: Ram, Updated On : June 5, 2020 9:27 am
Follow us on

జాగృత హిందూ సమాజ చారిత్రక నేపధ్యం 

పోయినభాగం లో హిందూ సమాజం ఎలా జాగృతమయ్యిందో, అధికారాన్ని ఎలా సుస్థిర పరుచుకుందో చూసాం. అదేసమయం లో ఇది పూల బాటే కాదు ఎన్నో అవరోధాలు పొంచిఉన్నాయనేది దృష్టి లో వుంచుకోవాలనేది ఈ భాగం సారాంశం. దాదాపు 1300 ఏళ్ళు మెజారిటీ హిందువులు ప్రధాన భూభాగం లో ఇతరుల ప్రభుత్వాల్లోనే వుండాల్సివచ్చింది. దీనికి కారణాలు అనేకం. భారతదేశం ఆధ్యాత్మికంగా ఒకదేశమైనా పరిపాలనా పరంగా అనేక రాజులు, రాజ్యాలుగా ఉండటంతో పశ్చిమ సరిహద్దు నుంచి వచ్చిన దాడుల్ని సమర్ధంగా ఎదుర్కోలేకపోయినవి. మొదట్లో హిందూ రాజులు ఒకరికొకరు మద్దత్తు తెలుపుకున్నా అది సరిపోలేదు. ఒక పెద్ద రాజ్యానికుండే అంగబలం, అర్ధ బలం వేరు అదే చిన్న రాజ్యాలు యుద్ధం లో కలవటం వేరు. ఇదే ప్రధాన కారణం. ఎక్కడయితే పటిష్ట హిందూ రాజ్యముందో అక్కడల్లా ప్రతిఘటనలు తీవ్రంగా ఉండేవి. అస్సాం లాంటి ప్రాంతాలు చివరిదాకా చోటు దక్కనీయలేదు. ఒరిస్సా లోనూ చాలా కాలం అదే జరిగింది. దక్షిణాదిన విజయనగర సామ్రాజ్యం చాలా కాలం ఇతరుల ప్రాబల్యాన్ని నిరోధించగలిగింది. మొఘలుల చివరిదశలో మరాఠా పోరాటం చరిత్రలో మైలురాయి. అదే ఒకే సామ్రాజ్యం వుండివుంటే చరిత్రగతి వేరుగా వుండేది. ఇది చరిత్ర నేర్పిన పాఠం. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పరిపాలన అన్నింటా అధునాతన ఆయుధాలతో మిన్నగా వుండటం తో హిందువులు, ముస్లిం లు కలిసి పోరాటం చేసినా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు కూడా పటిష్టమైన ఒక సామ్రాజ్యం లేకపోవటం కూడా కారణం. అప్పటికే మొఘలుల రాజ్యం బలహీనపడింది. మిగతా ప్రాంతాల్లో స్వతంత్ర రాజులు  బ్రిటిష్ వారి అధునాతన ఆయుధాలతో సరితూగే శక్తిలేదు. దానితో  మరో 200 సంవత్సరాలు ఇతరుల పాలనలో మగ్గవలసి వచ్చింది. చివరకు స్వాతంత్రం కూడా బ్రిటిష్ షరతులకు లోబడి దేశాన్ని రెండు ముక్కలుచేసి ( ప్రస్తుతం మూడు ముక్కలు) సాధించుకోవల్సివచ్చింది. కనీసం ఆ తర్వాతయినా సరైన పంధాలో నడవలేదు. దేశ భక్తియుత సమాజం , దేశ పునర్నిర్మాణ పట్టుదల కలిగిన సమాజంగా పరిణతి చెందలేదు. అభివృద్ధి పధం లో పయనించిన జపాన్, చైనా, దక్షిణ కొరియా , ఆగ్నేయ ఆసియా లా కాకుండా గమ్యంలేని ప్రయాణం కొనసాగించింది. ఇప్పుడిప్పుడే తన స్వంత దేశీయ పంధా వైపు అడుగులేస్తుంది.

ఇది ఒకఎత్తయితే వారసత్వ సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా విభజన గాయాలు ఈ రోజుకీ మనన్ని బాధిస్తూనే వున్నాయి. ఉత్తర భారతం, తూర్పు భారతం లో హిందువులు, ముస్లింలు ఇప్పటికీ రెండు ప్రత్యేక సమాజాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక వాయవ్య ప్రాంతం కాశ్మీర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. కొంతమేర దక్షిణాన , పశ్చిమాన ఆ ఘర్షణ వాతావరణం లేదు ( ఏదో కొన్ని స్థలాల్లో తప్ప ). కారణం ఎక్కువభాగం ఒకే మతస్థులైన హిందువులే ఉండటంతో మైనారిటీ లయిన ముస్లిం లు కూడా కలిసిమెలిసి సహజీవనం చేస్తూ మతం పెద్దగా అవరోధంగా లేదు. ముఖ్యంగా దక్షిణాది లో ఈ సంస్కృతి బాగా వుంది. అదే ఉత్తర భూభాగం అలాలేదు. విభజన గాయాలు పాతతరం లో ఇరువైపులా అలాగే వుండిపోవటం, గత 72 సంవత్సరాల్లో వాటిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోకపోగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వీటిని వాడుకోవటం తో సమాజం మరింతగా విడిపోయింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ముస్లింలు మైనారిటీలు అనేదానికన్నా సమాన స్థాయిలో గణనీయ సంఖ్యలో వున్న ఇంకో మతస్తులుగా వుండటం తో మెజారిటీ-మైనారిటీ సంబంధాల కన్నా రెండు సమానస్థాయి మతస్తుల సంబంధాలుగా చూడాల్సివుంటుంది. సహజంగానే అటువంటి సంబంధాలు సున్నితంగా వుంటాయి. ఈ ప్రత్యేకతని గమనించకుండా మైనారిటీ లుగానే పరిగణించి రాయితీలు, బుజ్జగింపు చర్యలు చేపట్టటంతో మెజారిటీ హిందువులు తమకన్యాయం జరుగుతుందనే భావన పెరిగి బిజెపి కింద సమీకృత మయ్యారు. రెండోది, దక్షిణ భారతం తో పోలిస్తే ఉత్తర భారతంలో మతభావనలు ఎక్కువగా వుండటం కూడా కారణం. అందుకే రామజన్మ భూమి ఉద్యమం వాళ్ళ మనస్సులో నాటుకుపోయింది. మూడోది, ముస్లిం లు మెజారిటీగా వున్న కాశ్మీర్ లో హిందువులను వెల్లగొట్టటం కూడా ఉత్తర భారత హిందువులు సమీకృతం కావటానికి కారణమయ్యింది. వీటికి ఇంకా ఎన్నో కారణాలు కూడా జత చేరాయి. అదే తూర్పు భారతం పరిస్థితి వేరు. తూర్పు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం లో హిందువులు అత్యంత మెజారిటీగా వుండటంతో సంబంధాలలో ఘర్షణ కన్నా సామరస్య వాతావరణం తో వుండేది. అదే రాను రాను మార్పులకు గురయ్యింది. తూర్పు పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వలసలు నిరంతరం జరగటం తో ముస్లిం లు గణనీయంగా జనాభా లో సమాన స్థాయి మతస్తులు గా మారారు. ఈరోజు ఆరెండు రాష్ట్రాల్లో దాదాపుగా మూడింట ఒక వంతు జనాభాగా ముస్లింలు వున్నారు. ఈ పరిణామం హిందువుల ఆలోచనల్లో మార్పుని తీసుకొచ్చింది. అంతర్జాతీయ మీడియా కాశ్మీర్ డోమిసైల్ చట్టాన్ని గురించి గోరంతని కొండంతలుగా చిత్రీకరిస్తుంది గానీ తూర్పు భారతం లో జరిగిన జనాభా మార్పుని ఏరోజూ ప్రపంచ దృష్టికి తీసుకురాలేదు. ఈ పరిణామం హిందువులు ఆ రెండు రాష్ట్రాల్లో సమీకృతం కావటానికి దోహదపడింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారం లోకి రాగలిగింది. ఈ సంవత్సరం చివరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. ఈ సమస్యల్ని సమగ్రంగా పరిశీలించకుండా మనం మత ఘర్షణ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేమని అర్ధంచేసుకోవాలి. ఇప్పుడు బిజెపి హిందూ సమాజ జాగృతి తో అధికారం లోకి రెండోసారి వచ్చిన తర్వాత ఎదుర్కుంటున్న సవాళ్ళను పరిశీలిద్దాం.

జాగృతమైన హిందూ సమాజం ఎదుర్కుంటున్న సవాళ్లేంటి?

అన్నింటికన్నా ముఖ్యమైన సవాలు ఇతర మతస్తుల మదిలో  ఇది అందరి ప్రభుత్వమనే భావన తీసుకురాగలగటం. మోడీ రెండో సారి ఎన్నికయిన తర్వాత తీసుకున్న నినాదం ‘ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ఈ సవాలు ని దృష్టిలో పెట్టుకొనే ఇచ్చినట్లు కనబడుతుంది. మోడీ ప్రభుత్వానికి ఇది కేంద్రబిందువుగా ఉండాలనే ఆ నినాదం సరయిన దిశలోనే వుంది. అయితే ఆరు నెలల్లోనే ముస్లిం లు ఆ నినాదాన్ని నమ్మటం లేదని జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇందుకు కారణమేమిటో పరిశీలిద్దాం. మొదటి ఆరు నెలలు మోడీ దూకుడుగా సామాజిక అంశాల్ని ముందుకు తీసుకు రావటం జరిగింది. అన్నింటికన్నా ముందుగా ముస్లిం మహిళల్ని దృష్టిలో వుంచుకొని ముమ్మూరు తలాక్ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇది ముస్లిం మత పెద్దలకి కోపాన్ని తెప్పించింది. అదేసమయం లో మేము వ్యతిరేకించినా పార్లమెంటు చట్టం చేసిందనే అసంతృప్తి పేరుకుపోయింది. ఆ తర్వాత కాశ్మీర్ కి సంబంధించి ఆర్టికల్ 370 ని రద్దుచేయటం, రాష్ట్రాన్ని రెండుగా చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించటం కూడా మత పెద్దల్లో అసంతృప్తిని పెంచింది. కాశ్మీర్ సమస్య ప్రత్యక్షంగా మత సమస్య కాకున్నా కాశ్మీర్ ప్రజలు మెజారిటీ ముస్లిం లు కావటం తో ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమనే భావన అందరిలో కాకపోయినా ఎక్కువమంది మత పెద్దల్లో గూడుకట్టుకుంది. తర్వాత సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు ఇవ్వటం, రామాలయం కట్టుకోవటానికి అనుకూలంగా ఈ తీర్పు వుండటం ఈ అసంతృప్తి ని మరింత పెంచి పెద్దదిచేసింది. అటు ప్రభుత్వం, ఇటు సుప్రీంకోర్టు కూడా తమ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనే భావన, ఏమీ చేయలేకపోతున్నామనే భావన మత పెద్దలు, మేధావుల్లో ఏర్పడింది. వాస్తవానికి మొదటి రెండింటిలో ముస్లిం ప్రయోజనాలకి వ్యతిరేకమైనది ఏమీ లేదు. మూడోది అతి సున్నితమైన సమస్య. అందరూ కోర్టు తీర్పుకి కట్టుబడి వుంటామని ముందుగానే ఒప్పుకుందే. వాస్తవానికి మధ్యవర్తిత్వ పరిష్కారానికి ఒప్పుకొని వుంటే ఇంత కన్నా మెరుగైన పరిష్కారం ముస్లిం లకు దక్కేదని పరిశీలకుల అభిప్రాయం. వీటితోపాటు మోడీ వచ్చిన తర్వాత మదరసాలను నియంత్రించి    ఆధునిక విద్యను  ప్రవేశపెట్టటం, ఒంటరిగా ముస్లిం మహిళలు హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయాన్ని కల్పించటం, ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్ పధకం లో ముస్లిం మహిళలు ఎక్కువమందికి లబ్ది చేకూరటం  లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టటం జరిగింది.

ఈ నేపధ్యం లో మోడీ ప్రభుత్వం పార్లమెంటు లో పౌరసత్వ సవరణ బిల్లు ని ప్రవేశపెట్టటం ఆమోదింప  చేసుకోవటం చక చకా జరిగింది. దీనితో ముస్లిం మత పెద్దల అసంతృప్తి పరాకాష్టకు చేరింది. వాస్తవానికి ఈ చట్టం భారతీయ పౌరులకు సంబంధించింది కాదు. బయట దేశాలనుంచి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇవ్వటానికి సంబంధించింది. కానీ దీనితోపాటు జనాభా పట్టిక, పౌరసత్వ పట్టిక లు వస్తే దేశం లోని ముస్లిం లు కూడా పౌరసత్వం కోల్పోవలసివస్తుందని చేసిన ప్రచారం ముస్లిం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ప్రధానమంత్రి స్వయంగా పౌరసత్వ పట్టిక గురించి ప్రాధమిక చర్చలు కూడా జరగలేదని వివరణ ఇచ్చినా నిరసన జ్వాలలు ఆగలేదు. కారణం , ఇది కేవలం ఓ వంక మాత్రమే. ఇది ఒకదానిమీద ఒకటిగా  పేరుకుపోయిన అసంతృప్తి,కోపం కలగలిపి పెల్లుబికిన నిరసనగానే చూడాలి. ఇస్లాం మత పెద్దలు, ఇస్లాం మేధావులు వున్నవి లేనివి కలిపి సామాన్య ముస్లింలలో భయాందోళనలు సృష్టించటంలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా డిల్లీ నిరసనలు పెద్దఎత్తున జరిగాయి. అందులో ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం వుపసంహరించుకోవాలనేదే ప్రధాన డిమాండ్. అది ఏవిధంగా దేశంలోని ముస్లిం లకు వ్యతిరేకమో చెప్పలేదు. అంటే పరోక్షంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అందరికీ పౌరసత్వం ఇవ్వాలనేదే వారి కోరిక. తర్వాత జరిగిన డిల్లీ అల్లర్లు నాగరిక సమాజానికే మాయని మచ్చ. అక్కడా ఒకవర్గానికే అన్యాయం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరగటం కూడా కుట్రలో భాగమే. ఘర్షణలో ఇరువర్గాల వారు చనిపోవటం, అల్లర్లకు ముందు నిధులు బ్యాంకులనుంచి తీయటం లాంటి నిర్దిష్ట సమాచారం తో ప్రభుత్వం ఛార్జ్ షీట్ దాఖలు చేయటం చూసాం. ఇంతకుముందే చెప్పినట్లు మత ఘర్షణల్లో రెండు వర్గాలవారు ఉంటారనేది సత్యం. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం కంటే దీనిలో ఎవరు ముద్దాయిలున్నా వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరముంది. అప్పుడే ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇందులో ఒక మతస్తులకు కొమ్ము కాయకుండా ముద్దాయి లందరినీ సమానంగా చూసినప్పుడే ‘ సబ్ కా విశ్వాస్ ‘ నినాదం పై నమ్మకం కుదురుతుంది. మోడీ ప్రభుత్వం అలా చేస్తే ముస్లిం సమాజం లోని అభ్యుదయవాదులు హర్షిస్తారు. వాళ్ళలో ప్రభుత్వం నిష్పక్షపాతంగాపనిచేస్తుందనే భావన ఏర్పడుతుంది. ఇది మోడీ ప్రభుత్వం పై విశ్వసనీయతని పెంపొందిస్తుంది.

మోడీ ‘సబ్ కా విశ్వాస్ ‘ దిశగా చేయాల్సిన పనులు

ప్రభుత్వం అందరిదీ అనే భావన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం నడిపే వారి మీదనే వుంటుంది. అవతలివారు అపోహలు, అపార్ధాలు కలిగించినా వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే వుంటుంది. ఉదాహరణకు కావాలనే మోడీ పై, ప్రభుత్వం పై ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారనే అనుకున్నా అది నిజం కాదని ముస్లిం లకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారం లో వున్న పార్టీ మీద వుంది. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు పార్టీలో కొంతమంది ముస్లిం లపై అవాకులు, చెవాకులు పేలుతూ వుంటే వాళ్ళను నియంత్రించాల్సిన  బాధ్యత పార్టీ అధ్యక్షుడి పై వుంది. అలాగే మంత్రులు అలా ప్రవర్తించినప్పుడు వాళ్ళను హెచ్చరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పై వుంది. ముస్లిం సమాజం లో సంస్కరణలకు మత పెద్దలు వ్యతిరేకమని తెలిసినప్పుడు ముస్లిం సమాజం లో ఎక్కువమందిని విశ్వాసం లోకి తీసుకొని వాళ్లకు వివరించాల్సి వుంది. చివరగా ఈ సంస్కరణలు ఆమోదించాల్సింది ముస్లిం సమాజమని మరిచిపోవద్దు.

పౌరసత్వ సవరణ చట్టం లో ఎటువంటి ముస్లిం వ్యతిరేక నిబంధనలు లేవని ముస్లిం లను ఒప్పించటం లో ప్రభుత్వం విఫలమయ్యిందని చెప్పొచ్చు. ఆ విషయం లో ముస్లిం సమాజంతో మరింత విస్తృత సంప్రదింపుల ప్రక్రియ జరిపి వుండాల్సింది. ఒక్కోసారి అపోహలు, అపార్ధాలే మనస్సులో లోతుగా నాటుకు పోతాయి. ఓపికతో వాటిని తొలగించే ప్రజా సంబంధాల ప్రక్రియని గట్టిగా, విస్తృతంగా చేయగలగాలి. అలా చేయకుండా నేను కరెక్టుగానే వున్నాననుకుంటే సరిపోదు. కొన్ని సమయాల్లో కరెక్టుగా వున్నట్లు కనిపించాల్సిన అవసరం కూడా వుంది. మధ్యయుగ, ఆధునిక భారత చరిత్ర చూసిన తర్వాత దానినుంచి గుణపాఠాలు  తీసుకొని ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని విశ్వాసం లో తీసుకొనే చర్యలు ప్రభుత్వం, పార్టీ చేపట్టినప్పుడే ‘సబ్ కా విశ్వాస్ ‘ నినాదం విజయవంతమవుతుంది.

చివరగా , మోడీ ప్రభుత్వం జాగృతమైన హిందూ సమాజానికి ప్రతినిధి అనుకున్నప్పుడు ఆ హిందూ సమాజ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించాల్సివుంది. ఒక్కసారి హిందూ రాజ్యాల చరిత్ర పరిశీలిస్తే అందరినీ, అన్ని మతాల వారిని సమానంగా ఆదరించి గౌరవించిన సంస్కృతి. బహుకొద్ది రాజ్యాలే దీనికి మినహాయింపు. అంటే సెక్యులర్ భావాలు అనాదినుండి వున్నాయి. అన్ని వాదనలు భౌతిక వాదాన్ని ప్రతిపాదించిన చార్వాకుడి వాదనలతో సహా సమానంగా గౌరవింపబడిన సంస్కృతి. మరి ఈరోజు హేతువాదులు వరసగా హత్యకు గురికాబడటం ఆ వారసత్వానికి మాయని మచ్చ. అలాగే అన్ని మతాలవారు సమానంగా సహజీవనం చేసే వాతావరణాన్ని కలిగించటం కూడా ఆ వారసత్వపు ప్రతినిధులకు బాధ్యతే. ఈ వారసత్వ సంస్కృతిని జాగృతమైన హిందూ సమాజం పరిరక్షిస్తుందని , కక్ష సాధింపు చర్యలకు ఇందులో తావు లేదని గ్రహించాలి. అప్పుడే సెక్యులర్ రాజ్యాంగాన్ని, హిందూ సమాజ చారిత్రక వారసత్వాన్ని కొనసాగించిన వాళ్ళవుతారు. ఇది మెజారిటీ హిందూసమాజ బాధ్యత.

మరి ఇన్ని మతాల సమూహంగా వున్న భారత్ లో మత సామరస్యం బలంగా ప్రజల మనస్సులో నాటుకుపోవాలంటే ఏం చేయాలి. ఇది ప్రభుత్వ చట్టాల ద్వారా సాధ్యం కాదు. ప్రజల మనోబలంతోనే సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమో చివరి భాగం లో చూద్దాం. అంతవరకూ సెలవు.