విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

మేము చదువుకునే రోజుల్లో చైనా అన్నా, చైనా విప్లవమన్నా వల్లమాలిన అభిమానం వుండేది. ‘చైనాపై అరుణతార’ రాసిన ఎడ్గార్ స్నో పుస్తకం అమితాసక్తితో ఒకటికి రెండుమూడుసార్లు చదివాం. చైనా లాంగ్ మార్చ్ కధలు విని ఒళ్ళు పులకించేది. మావో సేటుంగ్ నడిపిన ఎర్రవిప్లవం, రైతాంగ పోరాటం యువకులను ఉర్రూతలూగించాయి. చైనా విప్లవం కలిగించిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. 1962 భారత -చైనా యుద్ధం వరకూ హిందీ-చీనీ భాయ్ భాయ్ డిల్లీ వీధుల్లో మారుమోగింది. 1962 యుద్ధం […]

Written By: Ram, Updated On : July 18, 2020 8:33 pm
Follow us on

మేము చదువుకునే రోజుల్లో చైనా అన్నా, చైనా విప్లవమన్నా వల్లమాలిన అభిమానం వుండేది. ‘చైనాపై అరుణతార’ రాసిన ఎడ్గార్ స్నో పుస్తకం అమితాసక్తితో ఒకటికి రెండుమూడుసార్లు చదివాం. చైనా లాంగ్ మార్చ్ కధలు విని ఒళ్ళు పులకించేది. మావో సేటుంగ్ నడిపిన ఎర్రవిప్లవం, రైతాంగ పోరాటం యువకులను ఉర్రూతలూగించాయి. చైనా విప్లవం కలిగించిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. 1962 భారత -చైనా యుద్ధం వరకూ హిందీ-చీనీ భాయ్ భాయ్ డిల్లీ వీధుల్లో మారుమోగింది. 1962 యుద్ధం భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనూ మొట్టమొదట సారి విభేదాలు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కొచ్చాయి. నాయకుల్లో ఒకవర్గం భారత్ ని సమర్ధిస్తూ చైనాని ఖండిస్తే మరొక వర్గం చైనాని ఖండించటానికి నిరాకరించింది. ఆ వర్గమే తర్వాతదశలో సిపిఎం గా అవతరించింది. అయితే ఆ చీలిక అక్కడితో ఆగకుండా తర్వాతదశలో నక్సలైట్లు గా ఆవిర్భవించింది. మావో సేటుంగ్ నాయకత్వాన నక్సలైట్లను, ఈశాన్య భారత దేశంలో అనేక వేర్పాటువాద సంస్థలను ప్రోత్సహించటం జరిగింది. అయినా మావో సేటుంగ్ పై అభిమానం పూర్తిగా చావలేదు. ఎందుకంటే ఉడుకురక్తం అలాంటిది. వున్న వ్యవస్థలోని లోపాలపై కోపం, చైనా విప్లవంతో ఆ లోపాలు పోయి మంచి ఆదర్శ వ్యవస్థ ఏర్పడుతుందనే నమ్మకం ఆ అభిమానాన్ని చావకుండా ఉంచింది. దానికి తోడు కాలేజీ ల్లో దాన్ని ఆరాధించే సాహిత్యమే అందుబాటులో వుండేది. మా దగ్గర లైబ్రరీ ల్లో సగం పుస్తకాలు చైనా విప్లవాన్ని గురించే వుండేయి. ఆ గుడ్డి ఆరాధన లో మావో అన్నా , చైనా విప్లవమన్నా పడిచచ్చేవాళ్ళం. ఇందులో ఎటువంటి స్వార్ధం లేదు. సమాజం మారాలంటే అదే ఆదర్శమనే భావనలో వుండే వాళ్ళం.

అంతగా ఆరాధించే మావో వ్యక్తిగతంగా తప్పులుచేస్తాడని అనుకునేవాళ్ళం కాదు. మావో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా  దాన్ని ఓ వివాదాస్పద అంశంగా చూడలేదు. అదేసమయంలో ఒక పురుషుడు ఒక స్త్రీ తోనే వివాహబంధం ఆదర్శమనే రాముడి సంస్కృతికి వారసులం కూడా మనమే. సాధ్యమైనంతవరకు వివాహబంధాన్ని పవిత్రంగా భావించి ఒకరి నొకరు అర్ధం చేసుకుంటూ సహజీవనం కొనసాగించే సంస్కృతి మనది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే విడిపోయి వేరే వివాహం చేసుకొనే సంస్కృతి మనది. అయినా మన దేశ విప్లవ నాయకుల కన్నా కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో ఇతరదేశ నాయకుల్నే మన ఆదర్శ పురుషులుగా భావించే సంస్కృతిలో పెరిగాం. తప్పులేదు. మానవాళి కి మేలుచేసే ఏ సిద్ధాంతమయినా , ఏ నాయకుడైనా మనకు ఆదర్శమే. అయితే ఈ నాయకులు , ఈ సిద్ధాంతాలు నిజంగా దేశాలకతీతంగా విశ్వ మానవాళి కోసం పనిచేస్తున్నాయా అనేది ఒక్కసారి గుండెమీద చేయివేసుకొని పునఃపరిశీలన చేసుకుందాం.

మనకున్న పరిమిత వ్యాసంలో చైనా వరకే పరిమితమవుదాం. ముందుగా మనం అర్ధం చేసుకోవాల్సింది మనం అభిమానించే నాయకులు కూడా మనుషులే. వాళ్ళేమీ దైవాంశ సంభూతులు కాదు. దైవాన్ని నమ్మని వాళ్లకి వాళ్ళేమీ విమర్శకు, జవాబుదారీతనానికి అతీతులేమీ కాదు. దురదృష్టమేమంటే ఏ సిద్ధాంతమయితే ప్రశ్నించటం నేర్పిందో అదే సిద్ధాంతపు నాయకులు ప్రశ్నించటాన్ని తట్టుకోలేరు. పేరుకు శ్రామిక నియంతృత్వం అయినా, పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్య మయినా ఆచరణలో వ్యక్తి స్వామ్యమే శిరోధార్యం.అది మావో సేటుంగ్ అయినా, ఇప్పటి జీజిన్పింగ్ అయినా జరిగింది ఇదే. జీ జిన్పింగ్ జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకున్నా అది తప్పు అని ప్రశ్నించటం నేరమే.    మావో సేటుంగ్ ” గొప్ప ముందడుగు” పేరుతో దుస్సాహసిక నిర్ణయంతో లక్షలాదిమంది చనిపోయినా ప్రశ్నించే నాదుడులేడు. అదే పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యం. అలాగే పార్టీ పోలిట్ బ్యూరో లోని సీనియర్ నాయకులు అదృశ్యమైనా అడిగే నాదుడులేదు. అదే పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యం. సాంస్కృతిక విప్లవం పేరుతో విచ్చిన్నకాండ కొనసాగించినా అదీ పార్టీ నిర్ణయమే. నాయకులకే ప్రశ్నించే    దిక్కులేకపోతే సామాన్యప్రజల పరిస్థితి ఊహించుకోవచ్చు. కరోనా మహమ్మారి పై అసమ్మతి వ్యక్తం చేసిన వాళ్ళు మరలా కనబడరు. ఈ ఆదర్శం కోసమేనా ఎంతోమంది అన్నీ వదులుకొని పార్టీకోసం సర్వస్వం త్యాగం చేసింది? పౌరహక్కుల నాయకుల్లో ఎక్కువమంది వామపక్ష ప్రభావంలో ఉన్నవారే. మరి ఈరోజు కనీసం వాళ్ళు ఎంతోకొంత గొంతుపెగిల్చి ప్రజల హక్కులకోసం మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు కోరుకున్న శ్రామిక నియంతృత్వం వస్తే ముందుగా కత్తిరించే గొంతులు వాల్లవేనని మరిచిపోవద్దు.

ఇక అసలు విషయానికొద్దాం. చైనా భారత్ లోని వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ వాళ్ళ దేశంలో చేసిందేమిటి? ముందుగా మన సరిహద్దుల్లోని టిబెట్ ని బలవంతంగా ఆక్రమించుకొని టిబెట్ ప్రజల సంస్కృతిని, మతాన్ని, ఆచారాల్ని మంట గలిపిన మాట వాస్తవం కాదా? ఈరోజుకీ అక్కడ ఆత్మ బలిదానాలు ఎందుకు కొనసాగుతున్నాయి? వీఘర్ ముస్లింలను వాళ్ళ సంస్కృతిని, ఆచారాల్ని నాశనం చేయటం కోసం హాన్ జాతీయుల్ని పెద్దఎత్తున తరలించిన మాట వాస్తవం కాదా? హుయి ముస్లిం లను నానా రకాలుగా వేధించటం వాస్తవం కాదా? మరి మీ దేశంలో జాతులకు ‘విముక్తి’ కలిగించకుండా బలవంతంగా అణిచి వేస్తూ భారత్ లోని ఈశాన్య భారత జాతుల గురించి మాట్లాడటం రెండు నాల్కల ధోరణి కాదా? అటువంటి మీరు ఆదర్శనాయకులు ఎలా అవుతారు?

1959 లో చైనా పర్యటనలో  సోవియట్ యూనియన్ ప్రధాని కృశ్చేవ్ మావో సేటుంగ్ తో కేవలం కొన్ని కిలోమీటర్ల కోసం భారత్ తో తగాదా పెట్టుకోవద్దని సలహా ఇస్తే పెడచెవిని పెట్టింది వాస్తవం కాదా? సరే భారత్ మీ దృష్టిలో పెట్టుబడీదారి దేశం కాబట్టి దానితో యుద్ధం తప్పుకాదు. మరి సోవియట్ యూనియన్ తో సరిహద్దు యుద్ధానికి ఎందుకు కాలు దువ్వారు? అది అప్పటికి మీ సోదర కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వమే కదా? సరే అదీ సర్దుకుపోదాం , ఎందుకంటే అప్పటికి మీరు విప్లవవాదులు రష్యా రివిజనిస్టులు కాబట్టి! మరి వియత్నాం అమెరికా తో వీరోచిత పోరాటం చేసిన ఘన చరిత్ర గలిగిన పార్టీ గదా. ఆ పార్టీ ఆధ్వర్యాన వున్న ప్రభుత్వం తో సరిహద్దు యుద్ధం ఎందుకు చేసారో సెలవిస్తారా? మీ తలపైన వున్న చిన్న దేశం మంగోలియా తో కూడా మీకు సరిపడదు కదా. అదీ అప్పట్లో కమ్యూనిస్టు దేశమే కదా. ఈరోజు దక్షిణ చైనా సముద్రం లో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినా ఖాతరు చేయకుండా స్వేచ్చా మార్గానికి తూట్లు పొడుస్తుంది మీరు కాదా. మీ సరిహద్దు సముద్రదేశాలతో ఒక్క దేశంతో నైనా మీరు ప్రశాంతంగా వున్నారా? జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్ , వియత్నాం  లాంటి అన్ని దేశాలు మీ గిల్లికజ్జాలతో తలపట్టుకుంటున్నాయి కదా.  సరిహద్దు దేశాలు మయన్మార్, భూటాన్ లు కూడా మీ బాధలు భరించలేక పోతున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మిమ్మల్ని విప్లవ చైనా అని పిలవాలా? ఖచ్చితంగా కాదు. మీది విస్తరణ వాద చైనానే.

మరి ఇంతగా చైనా నిజ స్వరూపం బయటపడిన తర్వాత కూడా భారతదేశం లోని కమ్యూనిస్టులు చైనా విస్తరణ వాదాన్ని ఖండించటానికి ఎందుకు వెనకాడుతున్నారు? మీరు సిద్ధాంతానికి కట్టుబడ్డారా లేక చైనా దేశానికి , చైనా కమ్యూనిస్టు పార్టీకి విదేయులా అనేది తేల్చుకోవాల్సి వుంది. చైనా విస్తరణ వాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ , బిజెపి అనుకూలురుగా చెప్పలేరుకదా? ఈరోజు చైనా విస్తరణ వాదాన్ని వ్యతిరేకించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదేమో, ఒక్క మీరు తప్ప. ప్రపంచంలో అన్ని దేశాలు భారత -చైనా వివాదం లో భారత్ వైపు నిలబడితే మీకు మీ వైఖరి పై పునరాలోచన రావటం లేదా? 1950 దశకం లోనే ఎంతోమంది మేధావులు చైనా విషయం లో నెహ్రు కి హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. అయినా నెహ్రూ పెడచెవిని పెట్టాడు. చివరకు ఆ మనోవేధనతోనే నెహ్రూ చనిపోయాడని చెప్పుకుంటారు. చివరిగా ఒక్కమాట చైనా గానీ , చైనా కమ్యూనిస్టు పార్టీగాని విశాల దృక్పధంతో వాళ్ళ జాతీయవాద వైఖరిని విడనాడి ఆలోచించిన సంఘటన ఒక్కటి చెప్పగలరా? చైనా ని గురించి ఆలోచించే మీరు వియత్నాం ని గురించి కూడా ఆలోచించండి. ఈరోజు చైనా 21వ శతాబ్దపు నయా వలసవాద నాయకురాలిగా ఎదిగిందనేది ఏమాత్రం సిద్ధాంత అవగాహన వున్నవాళ్ళకు కూడా అర్ధమవుతుంది. నయా వలసవాద దోపిడీ అమెరికా చేసినా , చైనా చేసినా ఒక్కటే. అమెరికా చేస్తే తప్పు చైనా చేస్తే ఒప్పు కాదు మిత్రమా. మీ పార్టీల్లో ఎంతోమంది నిజాయితీగా మీ సిద్ధాంతం కోసం జీవితాల్ని అంకితం చేసారు. మరి ఆ సిద్ధాంతం వంచనకు గురికాబడితే ఇప్పటికీ అటువంటి పార్టీకి అటువంటి నాయకులకు వంతపాడటం మీ ఆశయాలకు తూట్లు పోడిచినట్లవ్వదా ? ఒక్కసారి ఆలోచించండి. చైనా విస్తరణ వాదాన్ని ఇప్పటికైనా ఖండించి మీ చిత్తశుద్ది ని నిరూపించుకుంటారని ఆశిస్తూ ……