అందుకే ఏదోవిధంగా మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఎత్తుగడ తీసుకున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాఫియా డాన్ వికాస్ దూబే 8 మంది పోలీసుల్ని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అతన్ని పట్టుకోవటానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఇవ్వాళో, రేపో అతన్ని పట్టుకోవటమో, ఎన్ కౌంటర్ చేయటం ఖాయం. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంఘ విద్రోహక శక్తులు, రౌడీ షీటర్లను ఎన్ కౌంటర్ చేయటం అందరికీ తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా ప్రత్యర్ధులు కులాల గుర్తింపు కార్డులు ముందుకు తీసుకొచ్చారు. కొంతమంది పనిగట్టుకొని ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయే వారందరూ నిమ్న వర్గాలు , ముస్లింలు వున్నారని అగ్రకులాల వారు లేరని ప్రచారం చేస్తున్నారు. ఇదే అదనుగా కాంగ్రెస్ అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు ఈ ప్రభుత్వం లో అన్యాయానికి గురవుతున్నారని ప్రచారానికి తెరలేపారు. ఏదోవిధంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలని అటు ఇటు ప్రత్యర్ధులు ప్రచారం చేయటం గమనార్హం.
ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణులు జనాభాలో 10 శాతానికి పైగానే వుంటారు. మన దక్షిణాదిలో లాగా కాకుండా వారు వ్యవసాయ వృత్తిలో గణనీయంగా వున్నారు. రాజకీయంగా మొదట్నుంచీ కాంగ్రెస్ మద్దతు ఓటు బ్యాంకుగా వుండేవారు. 2014 లో వీరందరూ బిజెపి వైపు మొగ్గు చూపారు. అప్పట్నుంచీ ఎలాగైనా తిరిగి పోయిన బ్రాహ్మణ ఓటు బ్యాంకు ని పొందాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ బ్రాహ్మణ నాయకుడి గా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద మాట్లాడుతూ యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందని విమర్శించాడు. వాస్తవానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో 9మంది బ్రాహ్మణులు మంత్రులుగా వున్నారు. ఇటీవల ఒక జర్నలిస్టు చనిపోయిన కేసుని ఆసరాగా తీసుకొని జితిన్ ప్రసాద బ్రాహ్మణులను రెచ్చగొట్టటానికి ప్రయత్నం చేయటం చూస్తుంటే కాంగ్రెస్ ఎంత నిస్పృహలో వుందో అర్ధమవుతుంది. ఇప్పుడు 8 మంది పోలీసులను కాల్చిచంపిన వికాస్ దుబే బ్రాహ్మణుడు కావటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. వికాస్ దుబే పై ఇప్పటికే 60కి పైగా క్రిమినల్ కేసులు వున్నాయి. తను సినిమా ఫక్కీ లో పోలీసుల్లో తన మనుషుల్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ముందస్తు సమాచారాన్ని తెప్పించుకొని డిఎస్పి తో సహా 8 మంది పోలీసులను మట్టు పెట్టటం దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. చివరకు దీన్ని కూడా కులానికి జరిగిన అన్యాయంగా చిత్రించటం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. నేరస్థుల్లో కులాల్ని వెతికే సంస్కృతి అత్యంత ప్రమాదకరం. గాంధీ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిసే కొద్దీ ఇంకెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి .