
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి విమాన రాకపోకలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త రకం వైరస్ ఇతర దేశాలకు పాకితే.. వాటికీ విమాన సర్వీసులను నిలిపేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ లాంటి యురోపియన్ దేశాలు యూకేకి ప్రయాణాన్ని నిలిపేశాయి. ఒకవేళ ఈ కొత్త రకం వైరస్ ఇతర దేశాలకు పాకినట్లు మాకు సమాచారం వస్తే.. ఆ దేశాలకూ విమానాలు నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తాం అని ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి 11.59 గంటల వరకు యూకే నుంచి ఇండియాకు విమానాలు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే వీటిలో వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్న నిబంధన విధించారు. పాజిటివ్‌గా తేలిన వాళ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని, నెగటివ్ వచ్చిన వాళ్లు ఏడు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని మంత్రి చెప్పారు.