
రాష్ట్రంలోని అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని బొంరాస్‌పేట మండలంలోని మెట్లకుంటలో క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అందించిన క్రిస్మస్ దుస్తులు, మహిళలకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తుందన్నారు. పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. పేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్ చైర్మన్ జ్యోతి పాల్గొన్నారు.