
బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఆర్టిస్టు తిప్పన్న బసవన్నెప్ప సోలబక్కనవర్ గురువారం మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హుబ్బళ్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. సోలబక్కనవర్ సిమెంట్ తో కళాకృతులు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. కర్ణాటకలోని ఆలమెట్టి రాక్ గార్డెన్, జానపద మ్యూజియంలతో పాటు కృష్ణాగార్డెన్, లవకుశ్ గార్డెన్ లలో ఆయన కళాకృతులు దర్శనమిస్తాయి. పశ్చిమ బెంగాల్ లోనూ ఆయన బొమ్మలు కనబడుతుంటాయి. సోలబక్కనవర్ చేసిన సేవలకు ప్రభుత్వం రాజ్యోత్సవ్, లలిత కళ అకాడమీ పురస్కారాలతో సత్కరించింది. ఆయన మృతికి కళాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.