మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఇరువురు ఎదురుపడుతుండడంతో కాల్పులు జరుగుతున్నాయి. దీంతో అటు మావోయిస్టులు, ఇటు భద్రతా బలగాలు బలవుతున్నారు. తాజాగా ఝార్ఘండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లా లోధ్ మాల్ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మంగళవారం రాత్రి ఇరు వర్గాలు ఎదురుపడగా కాల్పలు జరిగాయి. ఛేట్ గ్రామ సమీపంలో ముందుగా పోలీసులు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏరియా కమాండర్ పునరై ఒరాన్ హతమైనట్లు రాంచీ ఎస్ఎస్ పీ సురేందర్ ఝూ తెలిపారు. రాంచీ, గుల్మా, ఖుంటీ జిల్లాల్లో పునరై ఒరాన్ కీలక నేత. అతనిపై రూ.2 లక్షల రివార్డు కూడా ఉంది. తాజాగా ఆయన మరణంతో పార్టీ పెద్ద నాయకుడిని కోల్పోయినట్లయింది. కాగా మిగతా వారి కోసం గాలంపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఎస్ పీ తెలిపారు.