America Check On Russian Oil: రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయాలని చాలాకాలంగా భారత్‌ను బెదిరిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయిల్ కొనుగోలు సాకుగా చూపి మన దిగుమతులపై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. అయినా భారత్ వెనక్కు తగ్గలేదు. రష్యాతో ఉన్న మైత్రి కారణంగా భారత్ ఆయిల్ కొనుగోళ్లు చేస్తూ యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. తాజాగా మోదీ తనకు ఫోన్ చేశాడని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు క్రమంగా నిలిపివేస్తామని హామీ ఇచ్చాడని ట్రంప్ చెప్పుకున్నాడు. దీనిని భారత్ ఖండించింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని అనుకోవడం లేదని ప్రకటించారు. ట్రంప్ రష్యా అసహకర వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మాస్కోకు చెందిన ప్రముఖ చమురు దిగ్గజాలు రోస్నెప్ట్, ల్యూకాయిల్‌పై కఠిన ఆంక్షలు ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత్‌పై ప్రభావం..
భారత ప్రభుత్వ రంగ రిఫైనరీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటి వరకు రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేస్తున్నాయి. తాజా ఆంక్షల దృష్ట్యా, ఈ సంస్థలు తమ ఒప్పందాలు, కొనుగోలు విధానాలను పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రోస్నెప్ట్‌తో ఉన్న దీర్ఘకాల ఒప్పందం కూడా ఆర్థిక పరంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
మాస్కో–ఢిల్లీ బంధానికి సవాల్
ఉక్రెయిన్ ఘర్షణ అనంతరం పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల తర్వాత రష్యా చమురు భారత్‌కు తక్కువ ధరలకు లభించడం ప్రారంభమైంది. ఫలితంగా న్యూఢిల్లీ మాస్కోకు ప్రధాన మార్కెట్‌గా మారింది. అమెరికా తాజా ఆంక్షలతో ఆ సరఫరా ఇప్పుడు ప్రమాదంలో ఉంది. బ్లూమ్బర్గ్ సమాచారం ప్రకారం, అక్టోబరు నాటికి రష్యా నుంచి భారత దిగుమతులు రోజుకి సుమారు 1.8 మిలియన్ బ్యారెల్లకు పడిపోయాయి. ఆంక్షల కారణంగా ఈ పరిమాణం మరింత తగ్గే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తోందని కారణంగా గత నెలలలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అదనపు సుంకాలు విధించింది. కానీ ఇప్పుడు న్యూ ఢిల్లీ రష్యా దిగుమతుల్లో తగ్గింపుకు వెళ్తే, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సులభంగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఆ డీల్ కుదిరితే ప్రస్తుతం ఉన్న సుమారు 50% సుంకాలు 15–16% వరకు దిగవచ్చని వాణిజ్య వర్గాలు సూచిస్తున్నాయి.
భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన భద్రతను కాపాడుకోవడమే కాక, ఆర్థిక ప్రయోజనాలను కూడా సమతుల్యంగా కొనసాగించాలి. ఒకవైపు చమురు సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం అవసరం. మరోవైపు అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.