Andhra Telangana Debt Crisis: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 ఏళ్లుపూర్తయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడగా, ఆంధ్రప్రదేశ్ అప్పులు, కుప్పలు లేని రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ప్రయోజనం కలగలేదు. తెలంగాణ మాత్రం హైదరాబాద్ రాజధాని కారణంగా భారీగా ఆదాయం పొందుతోంది. ఇక ఏపీ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిపోయింది. అయితే 11 ఏళ్లలో పాలకులు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో చేసిన అప్పులతో ఇప్పుడు రెండు రాష్ట్రా్టలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇదే సమయంలో తెలుగు ప్రజలు కూడా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక వెసులుబాటు ఉన్నా అప్పులు కూడా పెరుగుతన్నాయి. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాలు దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాలుగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 2020–21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నట్లు నివేదిక చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది.
బ్యాంకుల పరిధిలో ఉన్నా.. ఆర్థిక భరోసా లేక..
ఏపీలో 15 ఏళ్లు పూర్తి చేసిన ప్రజలలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నారు. ఇది కర్ణాటక (95.9%) తర్వాత రెండవ ఉత్తమ స్థాయి. అయితే కర్ణాటకలో అప్పుల శాతం కేవలం 23.2% మాత్రమే ఉంది. అంటే, బ్యాంకింగ్ చేరిక పెరగడం అప్పు భారాన్ని తగ్గించలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక తెలంగాణలో 86.5% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు. దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో 14వ స్థానంలో ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ..
దక్షిణ రాష్ట్రాల సగటు ప్రకారం 92.1% మంది జనాభా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమయ్యారు. కానీ వారిలో 31.8% మంది అప్పుల బారిన పడినవారే. అంటే ఆర్థిక చేరికతోపాటు వడ్డీ ఆధారిత జీవనశైలి బలపడుతున్న సంకేతమిది. దీని విరుద్ధంగా ఈశాన్యరాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడ 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నప్పటికీ, అప్పుల శాతం కేవలం 7.4% మాత్రమే.
మహిళలు, ముస్లింలు ఎక్కువ..
సర్వే ప్రకారం.. బ్యాంకింగ్ చేరికలో పురుషులు (89.8%) ముందంజలో ఉండగా మహిళలు (84.5%) వెనుకబడ్డారు. మతపరంగా చూస్తే హిందువులలో 88.1% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కలిగి ఉండగా, ముస్లింలు 80.8% వద్ద ఆగిపోయారు. ఈ వ్యత్యాసం సామాజిక ఆర్థిక అవగాహనలో, ఆదాయ అవకాశాల్లో ఉన్న అసమానతలను చూపుతోంది. అప్పుల విషయంలో ఓబీసీలు (16.6%) ప్రధానంగా బరువును మోస్తుండగా, గిరిజనులు (11%) తక్కువగా ఉన్నారు. కుటుంబ పరిమాణం ఆధారంగా చూస్తే, పెద్ద కుటుంబాల కన్నా చిన్న కుటుంబాలపై అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంది.
ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వృద్ధి శుభ సూచకం అయినప్పటికీ, ఆర్థిక విద్య, పొదుపు సంస్కృతి లేకపోతే అది అప్పు భూతాన్ని తగ్గించలేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రభుత్వాలు, బ్యాంకులు కలిపి పొదుపు, పెట్టుబడి దిశలో అవగాహన పెంచితేనే ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. లేకుంటే తెలుగు ప్రజల అప్పులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.