Elon Musk AI prediction: ఎలాన్ మస్క్.. పరిచయం అక్కరలేని పేరు. ప్రపంచ కుబేరుల్లో మొన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్‌కు చైర్మన్‌గా పనిచేశాడు. ఇక టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ తదితర సంస్థల యజమాని. మస్క్ తాజాగా ఒక సాహసోపేత భవిష్యత్తు దృశ్యాన్ని వివరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, భవిష్యత్ అంతా కృత్రిమ మేధస్సు, రోబోట్లదే. ఇలాంటి సందర్భంలో మనుషులు ఇకపై రోజువారీ పనులకు బానిసలు కావాల్సిన అవసరం లేకుండా, తమకు ఇష్టమైన విషయాల్లో సమయాన్ని గడపగలుగుతారని వెల్లడించారు. ‘‘పని వ్యక్తిగత ఇష్టంగా, చిన్నపాటి తోట పనిలా మారుతుంది’’ అని తెలిపారు.
‘యూనివర్సల్ హై ఇన్‌కమ్’ ఆలోచన..
పని లేకపోయినా జీవనోపాధి ఎలా సాగుతుంది అన్నదే ప్రస్తుత సమాజంలో పెద్ద ప్రశ్న. మస్క్ అయితే దీనికి ఒక విభిన్న సమాధానం చూపిస్తున్నారు. ‘‘యూనివర్సల్ హై ఇన్‌కమ్’’. అంటే ఏఐ ద్వారా సృష్టితమయ్యే ఆదాయంలో భాగస్వామ్యాన్ని ప్రతీ మనిషి స్వయంగా పొందుతారు. యాంత్రిక వ్యవస్థల ఉత్పత్తులతో సిరిసంపద పెరగడం వల్ల ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగై, ఆదాయం వస్తుందనే భావన పొందుతారని పేర్కొన్నారు.
అనుమానాలెన్నో..?
అయితే, ఈ అభిప్రాయం అందరికీ ఆశాజనకంగానే అనిపించినా వాస్తవ రూపం పొందుతుందా అన్నది అనుమానాస్పదమే. ఇప్పటికే అమెజాన్ వంటి భారీ కంపెనీలు 2027 నాటికి లక్షలాది ఉద్యోగాలను రోబోట్లకు అప్పగించనున్నారు. ఈ రాటుదేలుతున్న పరిపాటీ సాధారణ ప్రజల్లో భయాన్ని కలిగిస్తోంది. ఉద్యోగం లేకుండా ఆదాయం వస్తుందనే హామీకి ఇప్పటివరకూ ఆచరణాత్మక దారులు లేవు. అయితే 2024లో పారిస్‌లో జరిగిన వివా టెక్ సదస్సులో కూడా మస్క్ ఈ ఊహను ప్రస్తావించారు. ఆయన అంచనా ప్రకారం, 80 శాతం అవకాశంతో మనిషి శ్రమ అవసరం లేకుండా సరుకులు, సేవలు సమృద్ధిగా ఉండే యుగం రానుంది. అదే సమయంలో ఆయన ఎక్స్ ఏఐ సంస్థ ద్వారా పూర్తి ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘‘మ్యాక్రోహార్డ్’’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
మస్క్ ఊహలలో భవిష్యత్తు మానవుడు పనిమీద ఆధారపడని జీవితాన్ని గడపడం ఒక ఆహ్లాదకర ఆలోచన. అయితే, ఆ దిశగా వెళ్ల్ళే మార్గం ఇంకా అనిశ్చితులో ఉంది. మనిషి చేసే నిర్ణయాలే, ఏఐని మానవ సంక్షేమానికి మార్గనిర్దేశం చేయగలవా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.