Ram Mandir: రామ అనే రెండు అక్షరాలు పవర్ ఫుల్. అత్యంత శక్తివంతమైనవి.. శుభకరమైనవి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ట వేడుకలు సందర్భంగా దేశం మొత్తం రాముడు ఫీవర్ నెలకొంది. రామ నామము ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.ఈ నేపథ్యంలో రామనామం గురించి, ఆ పేరులో ప్రత్యేకత గురించి ఒకసారి తెలుసుకుందాం.
శ్రీరామ నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. శ్రీరామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట. రామా అంటే రాముడు పలుకుతాడని అందరికీ తెలిసిందే. కానీ రామ అనే నామము ఉన్నచోట ఎక్కువగా విని ఆనందించేది హనుమంతుడే. ఇక శ్రీ అనే నామానికి లక్ష్మీదేవి పలుకుతుంది. రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు. మా అంటే శివుడు. ఓం నమశ్శివాయ అనే నామంలో నుంచి మ అనే జీవాక్షరం తీసుకున్నారు. శివుడు హనుమంతుని రూపంలో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు.. పార్వతి దేవి సైతం నాకు అదృష్టం కావాలని కోరింది. దీంతో హనుమంతుడి తోక రూపంలో పార్వతి వస్తుంది. రామా అన్నప్పుడు హనుమ వస్తే పార్వతి కూడా వచ్చినట్టే కదా. ఈ లెక్కన ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
ఏడు కోట్ల మహామంత్రాల్లో రామా అనే రెండు అక్షరాల మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. హరి హర తత్వాలు కలిసిన మహా మంత్రం ఇది. శ్రీ మహా విష్ణువు, పరమేశ్వరుడు కలిస్తే ఏర్పడిన దివ్య మంత్రం. దీనిని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక మన దేశంలోని ప్రతి వీధిలో కనీసం ఇద్దరైనా రామ అనే పేరు గల వ్యక్తులు ఉంటారు. రామ అనే పేరుకు అనుసంధానంగా పేర్లు సైతం ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఇక గ్రామాల పేర్లు సైతం చెప్పనక్కర్లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 3626 గ్రామాలు రామ అనే పేర్లు కలిగి ఉన్నాయి. రాముడు పేరుతో గ్రామాలను ఏర్పాటు చేస్తే సకల శుభాలు కలుగుతాయని.. చీడ పీడల ప్రభావం ఉండదని ప్రజల నమ్మకం. రాముడి రక్షణలో గ్రామాలు ఉంటాయని ఒక విశ్వాసం.