Ram Mandir: అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ట పొందిన తర్వాత ఎలా దర్శించుకోవాలి? దక్షిణ అయోధ్యను ఎలా చేరుకోవాలి? రైలు ప్రయాణం ఎన్ని గంటలు ఉంటుంది? బస్సు ప్రయాణం సులభమేనా? విమాన ప్రయాణం అనువుగా ఉంటుందా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అనేక న్యాయ పోరాటల తర్వాత రాముడి జన్మభూమి అయోధ్యలో బాల రాముడు ఆశీనుడయ్యాడు. తన సొంత ప్రాంతంలో గుడి కల సాకారం కావడంతో భక్తులకు బాల రాముడిగా దర్శనమివ్వనున్నాడు. సోమవారం అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట రాముడిని చూసేందుకు దేశ విదేశాలనుంచి హిందూ భక్తులు వస్తూ ఉంటారు. సోమవారం మినహా మంగళవారం నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. అయితే సోమవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు భారీగా వస్తున్న నేపథ్యంలో అయోధ్య రావద్దని నరేంద్ర మోడీ ఇప్పటికే భక్తులకు పిలుపునిచ్చారు. రాముడి ప్రతిష్ట నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే రామనామ సంకీర్తనలు ఆలపించాలని.. వారి వారి గృహాలలో రామ జ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఇక మంగళవారం నుంచి రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తూ ఉంటారు కాబట్టి అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, కొత్త బస్ స్టేషన్ లు సైతం ప్రారంభించారు.
అయోధ్య రామాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సరయు నది తూర్పు ఒడ్డున ఉన్నది. ఇది రాజధాని లక్నోకు 134 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామ మందిరం తో పాటు అత్యంత చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇక్కడున్నాయి. ఇందులో హనుమాన్ గర్హి, రామ్ కోట్, నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, తులసి స్మారక్ భవన్, త్రేతా కే ఠాకూర్, జైన్ టెంపుల్, మణి పర్వతం, చోటి దేవ్ కల్ టెంపుల్, రామ్ కీ పైడీ, సరయూ నది, క్వీన్ హో మెమోరియల్ పార్క్, గురుద్వారా, సూరజ్ కుండ్, గులాబ్, గుప్తర్ ఘాట్ వంటి చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.
బస్సుల్లో ఇలా..
ముందుగానే చెప్పినట్టు అయోధ్య నగరానికి దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు రోడ్డు మార్గం ఉంది. అయోధ్య నుంచి లక్నోకు 134 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ప్రయాగ్ రాజ్ నుంచి 166 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వారణాసి నుంచి 29 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాముడిని దర్శించుకునే భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం బస్సులను సిద్ధం చేసింది. మధుర, చిత్రకూట్, ఆగ్రా, ఢిల్లీ సహా ఇతర మార్గాల నుంచి సైతం బస్సులు నడిచే విధంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం పొగ మంచు కారణంగా బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 14 నుంచి అయోధ్యలో దాదాపు 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు సలార్పూర్, సహదత్ గంజ్, విమానాశ్రయం, హైవే, రామ్ పత్, ధర్మపత్ లో షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. దర్శన్ నగర్, కత్రా, అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్ ల నుంచి కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల షెడ్యూల్ ఆధారంగా ఈ బస్సులను అక్కడి రవాణా శాఖ నడుపుతుంది.
రైలు ద్వారా ఇలా..
అయోధ్య ఉత్తర రైల్వేలో ఉంది. మొగల్ సరాయ్_ లక్నో ప్రధాన మార్గంలో అయోధ్య నగరం ఉంది.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైలు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు.. అయోధ్య నగరంలోని రామ మందిరం రైల్వే స్టేషన్ కు 800 మీటర్ల దూరంలోనే ఉంది. అయోధ్యలో ఇటీవల ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. ఈ రైల్వే స్టేషన్ కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టారు.. రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ముందుగానే ఈ నగరానికి పలు ప్రాంతాల నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత శనివారం అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి ఆనంద్ విహార్ వరకు నడిచే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే శాఖ సికింద్రాబాద్ నుంచి అయోధ్య ధామ్ వరకు ప్రత్యేకంగా రైళ్ళను నడుపుతోంది.
విమానం ద్వారా..
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో చాలామందికి ఆర్థిక స్థిరత్వం పెరిగింది. ఈ క్రమంలో కొంతమంది బస్సు లేదా రైలు ద్వారా అయోధ్యకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా అంత సమయాన్ని ప్రయాణం కోసం వెచ్చించలేరు. అలాంటివారికి అభిమాన సదుపాయం కూడా అందుబాటులో ఉంది.. అయోధ్య నగరానికి ఇండిగో, ఎయిర్ ఎక్స్, వంటి కంపెనీలు విమాన సర్వీసులు ప్రారంభించాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కతా సహా పలు నగరాల నుంచి విమానాల షెడ్యూల్ విడుదలైంది. త్వరలో మరికొన్ని నగరాల నుంచి కూడా విమానాలు అయోధ్యకు నడవనున్నాయి.
హెలికాప్టర్ సర్వీస్ కూడా..
రోజురోజుకు ఎయిర్ టూరిజం పెరుగుతున్న నేపథ్యంలో కాశి_ అయోధ్య నగరాల మధ్య హెలికాప్టర్ సర్వీస్ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ఒకేరోజు రామ్ లల్లా.. కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కేదార్ నాథ్, వైష్ణో దేవి తరహాలోనే అయోధ్య, వారణాసి మధ్య హెలికాప్టర్ సేవలు ప్రారంభం కాలున్నాయి.. ఇందుకోసం వారణాసిలో మూడు, ఇదే ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ కోసం ఒకటి అయోధ్యలో రెండు హెలీ ప్యాడ్లు సిద్ధం చేశారు. అయోధ్యకు మీడియా విశేష ప్రచారం కల్పిస్తున్న నేపథ్యంలో భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ అధికారులు అంచనా వేస్తున్నారు..