Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణంతో ఉత్తరప్రదేశ్ స్వరూపమే మారనుంది. దేశంలో యూపీ కీలకంగా మారనుంది. గణనీయంగా ఆ రాష్ట్ర ఆదాయం పెరగనుంది. అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవంతో ఆధ్యాత్మిక పర్యాటకం మరింత పుంజుకుంటుందని ఎస్బిఐ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. 2024 – 25 లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా 25 వేల కోట్ల రూపాయలు ఆదాయం లభించే అవకాశం ఉంది. కేవలం సందర్శకులు రావడం వల్లే ఇంతటి ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా దేశీయ పర్యటనకు వెళ్లేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు పెద్దగా ఇష్టపడరు. ఆర్థిక భారం పడుతుందని దూరంగా ఉంటారు. అదే సమయంలో ఏడాదికి ఒక్కసారైనా తాము నమ్మే పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మాత్రం ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి వెళ్తారు. ఆ సమయంలోనే రవాణా రంగం తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలకు గిరాకీ పెరుగుతోంది. పలు రంగాలకు ఆదాయం అధికమై, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు అధిక మొత్తం లభిస్తుంది.గడిచిన రెండు నెలల కాలంలో యాత్రల ఫలితంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి 350 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.
ఇప్పుడు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరగనుంది. 2022లో ఉత్తరప్రదేశ్ ను మొత్తం 32 కోట్ల మంది సందర్శించారు. అందులో 2.21 కోట్ల మంది అయోధ్యకి వచ్చారు. విదేశీ పర్యటకులను ఆకట్టుకోవడంలో యూపీ ఐదో స్థానంలో ఉంది. వీరి నుంచి ఏటా రూ.10500 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అయోధ్యలో పర్యటకుల కోసం హోటళ్లు, గెస్ట్ హౌస్ ల నిర్మాణం అధికమవుతోంది. స్థలాల కొనుగోళ్లు అధికమయ్యాయి. ప్రధాన ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలోనే గజం స్థలం 2 లక్షల వరకు పలుకుతోంది. ఇటు నిర్మాణరంగం తో పాటు అటు రవాణా రంగం సైతం అభివృద్ధి చెందుతోంది. 2027 నాటికిమహారాష్ట్ర తో పాటు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ జిడిపిలో వీరి వాటా పది శాతం దాటుతుందని కూడా చెబుతుండడం విశేషం.