Snow Leopard : హిమలయాలు.. ప్రపంచంలోనే ఎంతో ఎత్తైన పర్వతాలు. అందులో ఎన్నో వృక్ష జంతుజాతులు. మంచుతో కప్పబడి ఉండే ఆ ప్రాంతంలో మనకు తెలియని ఎన్నో జీవజాతులు ఉన్నాయి. కానీ మనిషి మనుగడ కష్టం కాబట్టి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ ప్రకృతి రమణీయత గురించి అప్పుడప్పడూ తెలుసుకొని ఆనందించడం తప్ప మనం ఏమీ చేయలేం. హిమలయాలు ఎక్కే ట్రెక్కింగ్ వీరులు.. పలువురు ఆసక్తిగల వారు ఇప్పటికీ హిమాలయాల ప్రత్యేకతను మనకు వివరిస్తూనే ఉంటారు. తాజాగా హిమాలయాలపై ఆసక్తితో వెళ్లిన ఓ అమెరికన్ ఫొటోగ్రాఫర్ కు ఆ అందమైన దృశ్యాల్లో ఒక అద్భుతం కనిపించింది. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.

మంచు ప్రాంతాల్లో ఉండే చిరుతలను ‘గోస్ట్స్ ఆఫ్ ది మౌంటైన్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత అంతుచిక్కని జంతువులలో ఒకటిగా వీటిని పరిగణిస్తారు. అవి మధ్య ఆసియాలోని మంచు పర్వతాల్లో కఠినమైన -నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో జీవిస్తాయి. త్వరగా భయపడి పారిపోయే వీటిని గుర్తించడం చాలా అరుదు.

చాలా తక్కువ మంది వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌లు మంచు పర్వతాల్లో ఉండే అరుదైన చిరుతపులి యొక్క ఫొటోలను తీయగలుగుతారు. తాజాగా అమెరికాకు చెందిన కిట్టియా పావ్లోవ్స్కీ ఈ ఘనత సాధించారు. పావ్లోవ్స్కీ తాజాగా హిమాలయాల్లో సంచరిస్తున్న అరుదైన మంచు చిరత ఫొటోలు తీసింది. ఆమె సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. యానిమల్ ప్లానెట్ వంటి ప్రచురణలు, నేపాల్ రాయబార కార్యాలయం వంటి ప్రభుత్వ సంస్థలు వాటిని షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.

పావ్లోవ్స్కీ ఫోటోలు నేపాల్ లో తీసినవి.. తెల్లని -మంచుతో కప్పబడిన హిమాలయాల ప్రకృతి దృశ్యాలను బంధిస్తుండగా.. అందులో అరుదైన చిరుతపులి చిక్కింది. ఆమె ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ ఫోటోగ్రాఫర్ నేపాల్‌లోని మారుమూల ప్రాంతాలలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ హిమాలయ ప్రాంతాల్లో చిరుతపులిని ఫోటో తీసే ప్రయత్నంలో ఖుంబూ వ్యాలీకి చేరుకోవడానికి కాలినడకన 165 కి.మీలకు పైగా సుదీర్ఘ ప్రయాణం చేసింది. “భూమి మీద అత్యంత నిషేధించబడిన భూభాగం, ఊపిరితిత్తులకు గాలి అందని ప్రాంతం.. ఎత్తులు, ఎగురుతున్న శిఖరాలు , ఎత్తైన ఎడారుల గుండా నడిచిన తర్వాత.. ఇది నేను తీసిన ఫోటోలలో చాలా కష్టమైనది.. ఇప్పుడు బహుమతిగా దక్కింది” అని ఆమె తన ఫొటోలను షేర్ చేసి ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
ఆమె ఫొటోలపై ట్విట్టర్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికీ నేను చూసిన అత్యుత్తమ వ్యక్తి మీరేనని చాలా మంది పొగుడుతున్నారు. ఆ పర్వతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ప్రపంచానికి చూపించారు. చాలా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు అంటూ కొనియాడుతున్నారు. ఇంత అందమైన షాట్ ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అభినందనలు! అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.