UCC – Javed Akhtar : ముస్లింల యందు జావేద్‌ అక్తర్‌ వేరయా..!

వ్యక్తిగతంగా తాను యూసీసీకి మద్దతు ఇస్తానని జావేద్‌ అక్తర్‌ తెలిపారు. కానీ ఆచరణాత్మక ఇబ్బందులు చాలా ఉన్నాయన్నారు. భారతదేశం ఒక మతం, ఒకే సంస్కృతి, ఒక సంప్రదాయం ఉన్న సగటు యూరోపియన్‌ దేశం లాంటిది కాదన్నారు. ఇది చాలా విభిన్నమైన సంస్కృతులు, ఉప సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన దేశం అన్నారు.

Written By: NARESH, Updated On : July 9, 2023 8:46 pm
Follow us on

UCC – Javed Akhtar : జావేద్‌ అక్తర్‌.. పరిచయం అక్కరలేని పేరు. ప్రముఖ గీత రచయితగా ఆయనకు జాతీయ గుర్తింపు ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అక్తర్‌ తన గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో పురస్కారాలు కూడా ఆయనను వరించాయి. తాజాగా ఆయన కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుపై స్పందించారు. ప్రస్తుతం దేశావ్యాప్తంగా ఈ అంశంపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. కామన్‌ సివిల్‌ కోడ్‌ అవసరమని చాలా పార్టీలు భావిస్తుండగా, కొన్ని పార్టీలు, సంఘాలు మాత్రం ఇప్పుడు దానికన్నా ప్రాధాన్యం ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయని, కామన్‌ సివిల్‌ కోడ్‌ ద్వారా మోదీ తేనె తుట్టెను కదపాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జావేద్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అద్భుతం.. కానీ అమలే కష్టం..
భారతదేశంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుందని, అయితే దానిని సాధించడం ఆచరణాత్మకంగా కష్టమని గీత రచయిత జావేద్‌ అక్తర్‌ అన్నారు. అసలు యూసీసీకి సంబంధించిన డ్రాఫ్ట్ నే ఇంకా విడుదల కాలేదు. అందులో ఏముంటుందో తెలియదు.  ఏమీ తెలియకుండానే ఇప్పటి నుంచే కొట్టుకోవడం ఏంటని ఆయన అన్నారు. డ్రాఫ్ట్‌ లేకపోవడంతో యూసీసీ గురించి ప్రజల్లో గందరగోళం నెలకొందని అభిప్రాయపడ్డారు. సూత్రప్రాయంగా దాని ఆలోచనను ఇష్టపడుతున్నప్పటికీ, భారతదేశ పరిస్థితుల దృష్ట్యా అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదని పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా మద్దతు..
వ్యక్తిగతంగా తాను యూసీసీకి మద్దతు ఇస్తానని జావేద్‌ అక్తర్‌ తెలిపారు. కానీ ఆచరణాత్మక ఇబ్బందులు చాలా ఉన్నాయన్నారు. భారతదేశం ఒక మతం, ఒకే సంస్కృతి, ఒక సంప్రదాయం ఉన్న సగటు యూరోపియన్‌ దేశం లాంటిది కాదన్నారు. ఇది చాలా విభిన్నమైన సంస్కృతులు, ఉప సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన దేశం అన్నారు. యూసీసీ అమలు ఊహించడమే కష్టంగా ఉందని పేర్కొన్నారు. అమలు చేయగలిగితే మాత్రం గొప్ప నిర్ణయం అవుతుందని తెలిపారు.

డ్రాఫ్ట్‌ ద్వారా ప్రజలకు వివరించాలి..
యూసీసీ అమలుకు ముందు దీనిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని అక్తర్‌ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముందుగా డ్రాఫ్ట్‌ విడుదల చేయాలని అన్నారు. డ్రాఫ్ట్‌ ద్వారా చట్టంపై ఉన్న అనుమానాలు, సందేహాలు, భయాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో యూసీసీపై ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అభ్యంతరం చెప్పడంపై అక్తర్‌ మాట్లాడుతూ, దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదన్నారు. ‘నేను వారితో విభేదించలేను. వారు చెప్పిన ప్రతీ పదం యూసీసీలో సరిపోదు. వారు మాట్లాడుతున్న చట్టాలను బ్రిటీషర్లు తమ స్వలాభాల కోసం ప్రవేశపెట్టారు, వాటిని వారు సౌమ్యంగా అనుసరించారు. ఆ చట్టాలన్నీ ఖురాన్‌కు పూర్తిగా విరుద్ధమైనవి’ అని తెలిపారు. చాలా ఇస్లామిక్‌ దేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ నిషేధించబడినప్పటికీ ఇండియాలో మాత్రం కావాలని పోరాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం లాబోర్డుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

దేశంలోనే భిన్న ఆచారాలు..
దేశంలో దక్షిణ, ఉత్తర భారతదేశంలో వేర్వేరు ఆచారాలు ఉన్నాయని అక్తర్‌ వ్యాఖ్యానించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో, ఒక అమ్మాయి తన మామతో వివాహం చేసుకోవచ్చు. అది ఉత్తర భారతదేశంలో ఊహించలేనిది. ఇది అక్రమ సంబంధంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. యూసీసీ ద్వారా ఈ విషయాలను ఎలా బ్యాలెన్స్‌ చేస్తారో చెప్పాలన్నారు. యూసీసీ అమలుకు ముందు ప్రభుత్వం చాలా కలుపుగోలుగా వ్యవహరించాలని అక్తర్‌ సూచించారు.