Crop Loan Waiver
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాల మాఫీకి చర్యలు ప్రారంభించింది. ఆగస్టు 15 నాటికి పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. గడువు నెల రోజులే ఉండడంతో ప్రభుత్వం రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇక, ఇప్పుడు అమలు మార్గదర్శకాలను విడుదల చేశారు. అర్హతలను ఖరారు చేశారు.
రేషన్ కార్డు తప్పనిసరి..
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి రావడంతో హామీ అమలుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. నిధుల సమీకరణ చేశారు. రుణమాఫీకి సుమారు రూ.35 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రేషన్ కార్డు తప‍్పని సరి చేసింది. తెలంగాణలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును మ్యాండేటరీ చేస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా రుణమాఫీకి కూడా తప్పనిసరి చేసింది. గతంలో వైఎస్సార్, కేసీఆర్ రుణమాఫీ చేశారు. కానీ రేషన్‌కార్డు నిబంధన విధించలేదు. రేవంత్ సర్కార్ మాత్రం కొత్తగా ఈ నిబంధన తెచ్చింది. ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరు రుణం తీసుకుంటే కుటుంబ పెద్దకే రుణమాఫీకి అర్హత ఉంటుంది.
2023, డిసెంబర్ 9 వరకు గడవు..
ఇక రుణమాఫీకి గడువును 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో తీసుకున్న అన్ని పంట రుణాలను మాఫీకి అర్హతగా నిర్ణయించింది. స్వల్పకాలిక పంటలకు రుణమాఫీ వర్తించనుంది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ అమలవుతుందని మార్గదర్శకాల్లో స్పస్టం చేశారు. తెలంగాణలోని అన్ని వాణిజ్య, ప్రాంతీయ, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుంది.
రూ.2 లక్షలకు పైగా ఉంటే..
ఇక తాజా మార్గదర్శకాల్లో రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్నవారు.. ముందుగా ఆ రుణం బ్యాంకులకు చెల్లించాలని సూచించింది. తర్వాత ప్రభుత‍్వం రూ.2 లక్షలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక రుణమాఫీలో తొలుత మహిళల పేరుతో ఉన్న రుణాలు తొలి విడతలోనే మాఫీ చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులను తొలి విడత మాఫీకి అర్హులుగా నిర్ణయించింది. ఎన్ఐసీ నుంచి సేకరించిన సమాచారంతో క్రోడీకరించి అర్హులను ఫైనల్ చేస్తున్నారు. ప్రతీ బ్యాంకుకు నోడల్ అధికారి నియామకం పైన నిర్ణయం తీసుకున్నారు.
మార్గదర్శకాలు ఇవీ..
1. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
2. ఈ పథకం స‍్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
3. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు.. వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
4. 12.12.2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
5. ఈ పథకం కింద ప్రతీ రైతు కుటుంబం రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
6. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు కూడా ఉంటారు.
7. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రుణఖాతాలకు జమ చేయబడుతుంది. పీఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
8. రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ చేయాలి.
9. రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
10. ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత ఉన్న రూ.2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
11. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Farmers loan waiver guidelines released by telangana govt