Champions Trophy : కొమ్ములు ఏటవాలుగా పెరిగాయని పొట్టేలు కొండను ఢీకొడితే ఏమవుతుంది? తల పగిలి చస్తుంది. కొమ్ములు పెరిగాయని.. ఒళ్ళు మందమైందని.. కొవ్వెక్కి కొట్టుకుంటే.. కొండకు ఏమవుతుంది.. చివరికి పొట్టేలే కూరలో ముక్కవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా ఇలానే ఉంది. భారత క్రికెట్ కౌన్సిల్ దయ దక్షిణ్యాల మీద బతికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాకుగా చూపి.. బీసీసీఐ మీద అవాకులు చెవాకులు పేలుతోంది.
వచ్చే ఏడాదిలో..
వచ్చే ఏడాదిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనుంది. ట్రోఫీ నిర్వహించే బాధ్యతను పాకిస్తాన్ తీసుకుంది. ఇప్పటికే ఐసీసీకి ఒక బ్లూ ప్రింట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చేసింది. అయితే పాకిస్తాన్ ఒకవేళ చాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తే తాము ఆ దేశానికి వెళ్ళేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తమ జట్టును పాకిస్తాన్ దేశానికి పంపించబోమని ఇప్పటికే బీసీసీఐ బాధ్యులు పలు వేదికల మీద స్పష్టం చేశారు. ఒకవేళ భారత జట్టు ఆడాలి అనుకుంటే హైబ్రిడ్ విధానంలో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ బాధ్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 22 తేదీలలో ఐసీసీ వార్షిక సమావేశం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. ఆ సమావేశంలో టీమిండియా దాయాది దేశం వెళుతుందా? ఇక్కడే ఉంటుందా? ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తారా? లేదా? అనేది తేలిపోతుంది.
భద్రతా కారణాల దృష్ట్యా..
పాకిస్తాన్ దేశంలో నెలకొన్న భద్రత లోపాల వల్ల తాము ఆ ప్రాంతంలో ఛాంపియన్స్ ట్రోఫీని ఆడబోమని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు రెండు దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. 2008 నుంచి భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఈవెంట్స్ లో మాత్రమే ఈ రెండు జట్లు పరస్పరం తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఛాంపియన్ ట్రోఫీ ఆడేందుకు భారత్ తమ దేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పలు వేదికల మీద తన వాణి వినిపిస్తోంది. ఒకవేళ భారత్ తమ దేశానికి రాకుంటే 2026 లో భారత్ – శ్రీలంక వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ నుంచి తాము తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతుంది.
అయినప్పటికీ..
పాకిస్తాన్ అలా బెదిరింపులకు దిగుతున్నప్పటికీ.. బీసీసీఐ భారత జట్టును దాయాది దేశం పంపించేందుకు సిద్ధంగా లేదు. దీనికి బదులుగా దుబాయ్ లేదా శ్రీలంకలో టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ బాధ్యులు కోరుతున్నారు. గతంలో ఈ హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు నిర్వహించారని.. బీసీసీఐ బాధ్యులు గుర్తు చేస్తున్నారు. ఛాంపియర్ ట్రోఫీ లోని అన్ని మ్యాచ్ లు పాకిస్తాన్లో.. భారత్ ఆడే మ్యాచ్ లు పాకిస్తాన్ అవతల నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదిస్తోంది. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. భారత జట్టు పాకిస్తాన్ వెళ్లి ఆడితే.. ఆర్థికంగా జట్టు మేనేజ్మెంట్ కు భారీగా లాభం జరుగుతుంది. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు యాడ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అండార్స్ మెంట్ లు కుదుర్చుకుంటాయి.. ఒకవేళ భారత్ కనుక పాకిస్థాన్ లో ఆడకపోతే ఇవేవీ ఉండవు. అలాంటప్పుడు పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ కు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది.
మండిపడుతున్న అభిమానులు
పాకిస్తాన్ బెదిరింపులకు దిగడం పట్ల భారత అభిమానులు మండిపడుతున్నారు..”మీరెంత.. మీ బతుకెంత.. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐనే ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే కష్టం.. ముందు మీ దేశంలో భద్రతను పెంచుకోండి. మీ మీద ఉన్న ముద్రను తొలగించుకోండి. అప్పుడు ఏ దేశమైనా పర్యటిస్తుందని” అభిమానులు చురకలంటిస్తున్నారు.