Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో శనివారం (మార్చి 16న) మరో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక కోర్టు వేదికగా జరిగిన పరిణామాలతో ఒకే కేసులో ఒకరు జైలుకు వెళ్లగా.. ఒకరికి బెయిల్ మంజూరైంది. దీంతో సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లక తప్పలేదు.
కే జ్రీవాల్‌కు బెయిలు..
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు ఈడీ సుమారు 8 సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ, కేజ్రీవాల్ వివిధ కారణాలు చూపుతూ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ ఢిల్లీ సీఎంపై ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు కేజ్రీవాల్‌కు ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో కేజ్రీవాల్ శనివారం(మార్చి 16న) రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రారంభం కాగానే విచారణ జరిపిన న్యాయ మూర్తి.. విచారణకు హాజరు కాకపోవడానికి కారణాలు ఆరా తీశారు. దీనికి కేజ్రీవాల్ తరఫు లాయర్.. సీఎం అయినందున వివిధ కార్యక్రమాల్లో బిజీగగా ఉంటున్నారని అందుకే విచారణకు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు వెంటనే కేజ్రీవాల్‌కు రూ.లక్ష ష్యూరిటీతోపాటు రూ.15 వేల బాండ్ ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది.
కవితకు జైలు..
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోనే శుక్రవారం (మార్చి 15న) సాయంత్రం 5:20 గంటలకు ఈడీ తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు కవిత పాల్పడినట్లు పేర్కొంటూ కవితను అరెస్టు చేసి రాత్రి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే అనూహ్యంగా ఈడీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. విచారణ జరిపిన కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మొత్తంగా ఒకే కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఒకరికి బెయిలు మంజూరు చేయగా, మరొకరికి రిమాండ్ విధించడం గమనార్హం.
సుప్రీంకు వెళ్లే యోచన..
ఇక, మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నారు. ఈమేరకు ఆమె లాయర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈడీ సుప్రీంకు ఇచ్చిన మాట తప్పడం, చట్ట విరుద్ధంగా మహిళను రాత్రి అరెస్టు చేయడం, ఈడీ ఆఫీసులో ఉంచడం తదితర అంశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కవిత తరఫు లాయర్లు సమాలోచనలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.