Russia Offer To India: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 26 మంది యాత్రీకులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్‌పై ప్రతిదాడి మొదలు పెట్టింది. భారత సైన్యం పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత దాడిలో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది.
పటిష్టమైన సైనిక శక్తి ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, చైనా మనకన్నా ముందు ఉన్నాయి. ఇటీవలి భారత సైనిక శక్తి ప్రదర్శన నేపథ్యంలో భారత్‌కు రష్యా మంచి ఆఫర్ ఇచ్చింది. రష్యా భారత్‌కు సుఖోయ్–57, ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ల తయారీకి 100% సాంకేతికత బదిలీతో కూడిన ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించింది. ఈ ఒప్పందం భారత్‌కు స్వదేశంలో ఈ జెట్‌లను తయారు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది, ఇందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నాసిక్ యూనిట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ సాంకేతిక బదిలీ ద్వారా భారత్ ఈ జెట్‌లను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఎగుమతి చేసే సామర్థ్యాన్ని కూడా పొందవచ్చు. దీంతో భారత్ రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో సూపర్ పవర్‌గా మారే అవకాశం ఉంది.
అమెరికా ఎఫ్–35 ఆఫర్..
అమెరికా భారత్‌కు తన ఎఫ్–35ఏ స్టెల్త్ ఫైటర్ జెట్‌లను విక్రయించాలని ఆసక్తి చూపుతోంది. అయితే, అమెరికా సాంకేతికత బదిలీకి అనుమతించకపోవడం వల్ల భారత్ ఈ జెట్‌లను కేవలం కొనుగోలు చేసే దేశంగానే మిగిలిపోతుంది. ఇది భారత్‌కు స్వయం సమృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా లేదు.
సుఖోయ్–57 ప్రత్యేక లక్షణాలు
సుఖోయ్–57 ఫైటర్ జెట్ అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత, మాక్–2 వేగం, అధునాతన ఏవియానిక్స్‌తో అమర్చబడి ఉంది. ఈ జెట్‌లు భారత వైమానిక దళానికి గణనీయమైన శక్తిని అందిస్తాయి. భారత అవసరాలకు అనుగుణంగా ‘‘సూపర్ 30’’ రూపంలో 24 జెట్‌లను సమకూర్చే అవకాశం ఉందని సమాచారం.
రక్షణ రంగంలో భారత్ ఆధిపత్యం
రష్యా ఆఫర్ భారత్‌ను రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధ దేశంగా మార్చడమే కాకుండా, ఆయుధాల ఎగుమతిదారుగా కూడా స్థాపించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఒప్పందం భారత్‌ను రక్షణ రంగంలో అగ్రశక్తిగా నిలబెట్టే దిశగా ఒక ముందడుగు. నాసిక్‌లో ఉత్పత్తి సామర్థ్యం ద్వారా భారత్ తన రక్షణ పరిశ్రమను మరింత బలోపేతం చేసుకోనుంది.