Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములైన ఎల్ అండ్ టీ, టాటా సంస్థల అధికారులు, ఇంజీనిర్లు, ఉద్యోగులను ప్రధాని మోదీ అభినందించారు. రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం మోదీ అక్కడకు వచ్చిన అతిథులు, సాధువులను ఉద్దేశించి మాట్లాడారు. భావోద్వేగ ప్రసంగం చేశారు. మోదీ మాటల్లో, కళ్లలో రాముడు వచ్చాడు అన్న ఆనందం స్పష్టంగా కనిపించింది. రామాలయం పూర్తయిందని, దేశ నిర్మాణంపై దృష్టిపెడతానని ప్రకటించారు. 2024, జనవరి 22 కొత్త కాలచక్రానికి నాంది అవుతుందని తెలిపారు. భారత న్యాయ వ్యవస్థ హిందువుల కలను నిజం చేసిందన్నారు. అనేక మంది త్యాగాలు, బలిదానాల తర్వాత మన రాముడు వచ్చాడని వెల్లడించారు.
అతిథులకు కరచాలనం..
ఇక రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులతో మోదీ కరచాలనం చేశారు. ప్రసంగం అనంతరం అతిథుల వద్దకు మోదీ స్వయంగా నడుచుకుంటూ వచ్చారు. పలకరిస్తూ కరచాలనం చేశారు. నమస్కరించారు. ముచ్చటించారు. అతిథులు కూడా వినమ్రంగా మోదీకి ప్రణామం చేశారు. శుభాకాంక్షలు తెలిపారు.

కార్మికులపై పూల వర్షం..
ఇక అతిథులను కలిసిన తర్వాత మోదీ, అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు, అధికారులు, ఇంజినీర్ల వద్దకు వచ్చారు. బుట్టలో గులాబీ పూలు తీసుకుని వారి వద్దకే వెళ్లి వారిపై పూల వర్షం కురిపించారు. పుష్ఫాభిషేకం చేశారు. ఇందులో ఎల్‌అండ్‌టీ, టాటా సంస్థల అధికారులు, కార్మికులు, ఇంజినీర్లు ఉన్నారు. ప్రధాని మోదీ తమవద్దకు వచ్చి పూలతో అర్చించడం చూసి కార్మికుల పులకించిపోయారు. భావోద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి నమస్కరించారు. అక్షర్‌ధామ్ ఆలయ సమయంలోనూ మోదీ అక్కడి పారిశుద్య కార్మికులకు పాదపూజ చేశారు. తాజాగా కార్మికులకు పుష్ఫాభిషేకం చేశారు. మోదీ అందరిలా కాకుండా, కీర్తి రావడానికి కృషి చేసిన కార్మికులనూ గుర్తిస్తూ వస్తున్నారు. అయోధ్యలో ఎక్కువ మంది ఉండడంతో వ్యక్తిగతంగా కలవకపోయినా అందరిపై స్వయంగా పూలు చల్చి కృతజ్ఞతలు తెలిపారు.