PM Modi RSS Relation: నరేంద్రమోదీ.. పరిచయం అక్కరలేని పేరు.. 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తి.. దేశాన్ని ఐదో ఆర్థిక శక్తిగా నిలిన నేత. రాబోయే మూడేళ్లలో మూడో స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న విశ్వగురువు. గతంలో భారతీయ జనతాపార్టీ గతంలో ఎన్నడూ గెలవని రాష్ట్రాల్లోనూ పార్టీని గెలిపించి అధికారంలోకి తెచ్చిన సూపర్ ప్లానర్. అయితే ఇంతటి కీర్తి ఉన్న మోదీ.. రిటైర్మెంట్‌పై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఈ చర్చను బీజేపీ పెద్దగా పటించుకోవడం లేదు. కానీ విపక్షాలు మాత్రం గట్టిగానే తమ వాయిస్ వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మధ్య సంబంధం చర్చనీయాంశంగా మారింది. బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ విభాగంగా భావిస్తారు. మోడీ, సంఘ్ ప్రచారక్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ, మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడతారా అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులను ఆకర్షిస్తోంది.
Also Read: ట్రంప్ తో జెలెన్స్కీ, యూరప్ నేతల భేటీ.. యుద్ధం ఆగుతుందా?
బీజేపీకి శక్తి కేంద్రం
ఆర్‌ఎస్‌ఎస్ 1925లో స్థాపించబడి, జనసంఘ్ ద్వారా బీజేపీ ఆవిర్భావానికి దారితీసింది. బీజేపీ ఎన్నికల విజయాల వెనుక సంఘ్ గ్రౌండ్ వర్క్ ఉంటుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సంఘ్ శాఖలు, సమాజ సేవా కార్యక్రమాల ద్వారా బీజేపీకి బలమైన మద్దతు అందిస్తుంది. మోదీ∙సైతం సంఘ్ నుంచి రాజకీయ శిక్షణ పొందినవారే. అయితే, సంఘ్ పట్ల గౌరవంతోపాటు రాజకీయ ఒత్తిడులు కూడా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
దూరమైన సంబంధం?
2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ‘‘బీజేపీకి ఇప్పుడు సంఘ్ అవసరం లేదు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సంఘ్–బీజేపీ మధ్య భేదాభిప్రాయాలను సూచించాయి. ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడంతో, సంఘ్ మద్దతు లేకపోవడమే కారణమని కొందరు భావించారు. ఈ నేపథ్యంలో, మోడీ–అమిత్ షా సంఘ్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారని అంటారు. మోడీ 2025లో నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించడం, 11 ఏళ్ల ప్రధానమంత్రిత్వంలో తొలిసారి కావడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సంఘ్‌ను ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జీవో’’గా కొనియాడారు. ఈ ప్రశంసలు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయాలకు సంఘ్ మద్దతును గుర్తుచేస్తాయి. ఇది రాజకీయ వ్యూహంగా, సంఘ్‌తో సమన్వయాన్ని బలపరచడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తుంది.
బీజేపీ అధ్యక్ష ఎన్నిక..
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక సంఘ్–బీజేపీ సమన్వయాన్ని స్పష్టం చేస్తుంది. సంఘ్ నేతను ఎంపిక చేస్తే, బీజేపీ సంఘ్‌తో సన్నిహితంగా కొనసాగుతుందని అర్థం. బీహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ సంఘ్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడతారనడం కంటే, సంఘ్ పట్ల గౌరవం, రాజకీయ అవసరాల కలయికే కనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత సంఘ్ బలాన్ని గుర్తించిన మోదీ, రాజకీయ విజయాల కోసం సంఘ్‌తో సమన్వయాన్ని బలపరుస్తున్నారు.