Chandrayaan 3 : ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 విజయవంతమైంది. అమెరికా, చైనా, రష్యా సరసన భారత్ నిలిచింది. గతంలో చంద్రయాన్_2 విక్రం లాండర్ విఫలమైన నేపథ్యంలో ఇస్రో దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకుంది. ప్రయోగానికి సంబంధించి అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంది. రష్యా లూనా విఫలమైన చోట విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. చంద్రయాన్ విజయవంతమైన నేపథ్యంలో ఒక్కసారి ఆ ప్రయోగానికి సంబంధించిన ప్రత్యేకతలు తెలుసుకుందాం.
చంద్రయాన్ ప్రాజెక్టు విలువ 615 కోట్లు. ఇది ఆది పురుష్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ. దీనిని ఎల్ వీ ఎం_3 రాకెట్ ద్వారా ప్రయోగించారు. జూలై 14న నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి దీనిని అంతరిక్షంలోకి పంపించారు. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్_3 చంద్రుడి మీద కాలు మోపింది. ఈ ల్యాండర్ బరువు 1752 కిలోలు. రోవర్ బరువు 26 కిలోలు. అయితే ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే ఒకవేళ ఈ ల్యాండర్ చంద్రుడి మీద సేఫ్ గా ల్యాండ్ కాకపోతే ఆగస్టు 27కు వాయిదా వేయాలని ఇస్రో నిర్ణయించుకుంది. ఎందుకంటే ఏ దశలోనూ ఈ ప్రయోగాన్ని కోల్పోవడం ఇస్రోకు ఇష్టం లేదు.” చంద్రుడి ఉపరితలంపై 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ దిగేందుకు ప్రయత్నిస్తోంది. వేగాన్ని నియంత్రించ లేక పోతే క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు కమాండ్లను అప్ లోడ్ చేస్తాం. టెలిమెట్రీ సిగ్నల్స్ ను విశ్లేషించి చంద్రుడి స్థితిగతులను పరిశీలిస్తాం. ఆ సమయంలో ల్యాండర్ మాడ్యూల్ పారామీటర్ల పనితీరుకు సంబంధించి ఏవైనా అసాధారణంగా కనిపిస్తే ల్యాండింగ్ 27కు వాయిదా వేస్తాం” అని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారంటే వారు ప్రయోగం మీద ఏ స్థాయిలో ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
దక్షిణ ధృవం ఎందుకంటే
ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు భావిస్తుండడమే.. ఈ ప్రాంతంలో మంచు స్పటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని నాసా కూడా గుర్తించింది. దక్షిణ ధ్రువం పై గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైనస్ లలో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్నచోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రుడిపై పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ రాళ్లు, పిల్లలు తక్కువగా ఉంటాయి. దీంతో ల్యాండర్ తీయడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది.