Chandrayaan 3 : అది సెప్టెంబర్ 7, 2019. చంద్రయాన్_2 మిషన్లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడు మీదికి ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో విఫలమైంది. ఫలితంగా దేశం మొత్తం డీలా పడిపోయింది. ఇస్రో చైర్మన్ శివన్ అయితే కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతడిని అనునయించాడు. కానీ ఆ ఓటమి నుంచి శివన్ ఒక జీవితానికి మించి పాఠం నేర్చుకున్నాడు. ఎక్కడ విఫలమయ్యామో గుర్తించి దానిని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకున్నాడు. అదే నేటి చంద్రయాన్_3 విజయవంతానికి కారణమైంది. చంద్రయాన్_3 కి సంబంధించి అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఇస్రో చైర్మన్ గా అతడు పదవి విరమణ చేశాడు. ఆయన తర్వాత సోమనాథ్ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇస్రో చైర్మన్ గా పదవి విరమణ చేసినప్పటికీ ప్రస్తుతం ఇస్రో సాధించిన ఆ విజయాన్ని అతడు ఆస్వాదిస్తున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ విజయానికి అతడు కర్త, కర్మ, క్రియ.
చంద్రయాన్_3 విజయవంతం తర్వాత దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు మెసేజ్ లు, పోస్టు లు హోరెత్తిపోతున్నాయి. ట్విట్టర్లో అయితే చంద్రయాన్_3 ట్రెండింగ్లో ఉంది. గ్లోబల్ పరంగా చూసుకున్నా ఇదే టాపిక్ వైరల్ కేటగిరి లో ఉంది. సరే విజయం సాధించిన తర్వాత ఈ సంబరాలు సాధారణమే. కానీ ఇస్రో చంద్ర యాత్రకు సంబంధించి శివన్ వేసిన అడుగులు మామూలువి కావు.. చంద్రయాన్_1 ద్వారా చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని కనుగొన్న ఇస్రో.. ఆ తర్వాత తన దృష్టిని దక్షిణ ధ్రువం వైపు మళ్ళించింది. చంద్రయాన్_2 ప్రయోగం ద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కోవాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయం వెనక శివన్ దీర్ఘ దృష్టి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటారు. తక్కువ బడ్జెట్ లోనే ఆయన ఆ ప్రయోగాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే శాస్త్రవేత్తల బృందాన్ని నడిపించారు. చంద్రయాన్_1 తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొని చంద్రయాన్_2 ను రూపొందించారు.. ప్రయోగ రాకెట్ నుంచి మొదలు పెడితే రోవర్ బరువు వరకు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ సేఫ్ గా ల్యాండ్ అయ్యే సమయంలో ఆ ప్రయోగం విఫలమైంది.
ఈ ప్రయోగం విఫలమైన తర్వాత శివన్ బయటి ప్రపంచానికి కనిపించలేదు. ప్రయోగ కేంద్రంలో మాత్రమే అహోరాత్రాలు శ్రమించారు.. ఎలాగైనా సరే దక్షిణ ధృవం మీద మూడు రంగుల జెండాను పాతాలి అనేది ఆయన సుదీర్ఘ స్వప్నం.. చంద్రయాన్_2 విఫలమైన తర్వాత మోడీ ఆయనను అనునయిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని చెవిలో చెప్పారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గో హెడ్ అన్నట్టుగా తల ఊపారు. సాధారణంగా ఒక ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్త నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. కానీ అక్కడ ఉన్నది శివన్ కాబట్టి దేశ ప్రయోజనం కోసమే ఆలోచించాడు. దేశం గురించి మాత్రమే తపనపడ్డాడు. ఆ తపన నుంచే చంద్రయాన్_3 కి అడుగులు వేసేలా చేశాడు. అదే నేడు విజయవంతమై మూడు రంగుల పతాకాన్ని చంద్రమండలం మీద ఎగిరేలా చేసింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశాన్ని నిలిపింది. మిగతా దేశాలకు సాధ్యం కాని దక్షిణ ధ్రువాన్ని మన విక్రం పాదాక్రాంతం చేసింది. సాహో శివన్. ఈ విజయంలో వచ్చే ప్రతి ప్రశంస నీకు చెందినదే. ప్రతి అభినందన నీకు సొంతమైనదే.