JEE Main 2024 Result: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 23 మంది విద్యార్థులు వందశాతం పర్సంటైల్ సాధించి రికార్డు సృష్టించారు. వీరిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారు కావడం మరో విశేషం. జేఈఈ తొలి విడత పరీక్ష జనవరి చివరి వారంలో జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,000 మంది హాజరయ్యారు. ఫలితాలను మంగళవారం ఎన్‌టీఏ విడుదల చేసింది.
23 మందికి వందశాతం పర్సంటైల్..
11 లక్షల మందిలో 23 మంది వందశాతం పర్సంటైల్ సాధించగా ఇందులో ఏడుగురు తెలంగాణకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున వంద శాతం పర్సంటైల్ సాధించారు. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఇద్దరు నూరుశాతం స్కోకర్ సాధదించారు. అంటే 23 మందిలో పది మంది తెలుగు విద్యార్థులే.
అన్నింటిలో ప్రతిభ..
ఈ పర్సంటేజీ మార్కుల ఆధారంగా చేసింది కాదని, అన్ని పేపర్లలో ప్రతిభ ఆధారంగా సాధారణీకరణ చేసి నిర్ధాచించినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. ఆంగ్లం, హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించారు. దేశంతోపాటు దేశం వెలుపల కూడా పరీక్ష నిర్వహించినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.
ఏప్రిల్‌లో రెండో విడత..
జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగింది. రెండో విడత పరీక్ష ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తారు.