BRS On Maharashtra: ఆదిలోనే హంసపాదు అనే సామెతకు అర్థం ఇదే కాబోలు. తెలంగాణ మోడల్ అమలు చేస్తాం. రైతు బంధు పథకం ఇస్తాం. దళిత బంధు అందరికీ వర్తింప చేస్తాం. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తాం అని భారత రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ ఇచ్చిన హామీలు మహారాష్ట్రలో వర్కౌట్ కాలేదు. దీంతో ఆ పార్టీని ఆదిలోనే పో పోవోయ్ అంటూ మహారాష్ట్ర ఓటర్లు దూరం పెట్టారు. వానికి గత కొద్దిరోజులుగా మహారాష్ట్ర మీద కేసీఆర్ బాగా దృష్టి సారించారు. అక్కడ మీడియాకు ఏకంగా 15 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారు. మూడు చోట్ల భారీ బహిరంగ సమావేశాలు నిర్వహించారు.. చోటా మోటా నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి సకల మర్యాదలు చేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.
గట్టి ఎదురుదెబ్బ
తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్ జిల్లాలోని భోకర్ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ 18 డైరెక్టర్ పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిన నాయకులు పరాజయం పాలయ్యారు. శనివారం అక్కడ ఓట్ల లెక్కింపు జరిగింది.. కాంగ్రెస్ మద్దతుదారులు 13, ఎన్సీపీకి 2, బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోవడం ఇక్కడ విశేషం. ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్ సింగ్ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి, బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే వచ్చిన మార్కెట్ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేసింది. భారత రాష్ట్ర సమితి పప్పులు ఇక్కడ ఉడకలేదు. ముందు నుంచి ఈ కమిటీలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్ వర్గం), బీజేపీకి మధ్య ముక్కోణ పోటీ ఉంది. పైగా ఈ మార్కెట్ మాజీ సీఎం అశోక్ చవాన్ నియోజకవర్గం(భోకర్) పరిధిలో ఉంది. దీంతో ఆయన ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. అటు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్ పాటిల్ చికిల్కర్ కూడా వారం రోజులుగా భోకర్‌లోనే ఉంటూ.. అవిశ్రాంతంగా ప్రచారం చేశారు.
కొంతకాలంగా మహారాష్ట్రలో..
కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలను బీఆర్ఎస్ విస్తరిస్తోంది. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. అంతే కాదు ఇటీవల బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్.. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంలోనే వచ్చిన భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. కానీ, నాగ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా.. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. దీంతో భారత రాష్ట్ర సమితి ఆత్మరక్షణలో పడింది.
హామీలు ఇచ్చినా ప్రయోజనం లేదు
తమ మద్దతు దారులను గెలిపిస్తే.. తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని భారత రాష్ట్ర సమితి హామీలు ఇచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన శివసేన(ఉద్ధవ్‌ఠాక్రే) వర్గం కూడా ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. మహారాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మార్కెట్ కమిటీల ఎన్నికల్లో ఫలితాలు విడుదలవ్వగా.. సింహభాగం స్థానాలను కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కైవసం చేసుకోవడం గమనార్హం.
ఈ మార్కెట్ ఎందుకు ప్రత్యేకమంటే?
భోకర్ మార్కెట్‌కు నాందేడ్ జిల్లాలోనే కాదు మహారాష్ట్రలోనే అతిపెద్దదనే పేరుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు– 1964లో నోటిఫై అయిన ఈ మార్కెట్ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో చాలామంది ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఇక్కడి నుంచి చక్రం తిప్పి మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. సుమారు 64 గ్రామాలు ఈ మార్కెట్ పరిధిలో ఉన్నాయి. 15 కోల్డ్ స్టోరేజీలున్న ఈ మార్కెట్– సజ్జలు, జొన్నలు, శనగలు, పెసలు, సోయా, నువ్వులు, కందులు, గోధుమలు, పొద్దుతిరుగుడు గింజలకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి పలు ఆహార ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇక్కడ సుమారు రోజు కోట్లల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడి ఎన్నికలను రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.