Homeప్రత్యేకంCBN-Pawan : చంద్రబాబుతో పవన్ భేటి.. ఉడికిపోతున్న బీజేపీ

CBN-Pawan : చంద్రబాబుతో పవన్ భేటి.. ఉడికిపోతున్న బీజేపీ

CBN-Pawan : ఏపీలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది కూడా లేదు. సంక్రాంతి తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో ఎనిమిది నెలల సమయమే ఉందన్న మాట. దీంతో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార వైసీపీ ఒంటరిగా వెళ్లేందుకు డిసైడ్ కాగా.. టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. ఇటీవలే చంద్రబాబు, పవన్ లు భేటీ అయ్యారు. పొత్తుల అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ కాస్తా భిన్నంగా ఉంది. బీజేపీని తమతో తీసుకెళ్లాలని చంద్రబాబు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అటు పవన్ సైతం అటువంటి ప్రయత్నమే చేశారు. కానీ ఇరువురు నేతల ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. దీంతో తాజాగా వారిద్దరు చర్చించుకోవడం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీలో భిన్నస్వరాలు..
బీజేపీ కోసం చివరకూ వెయిట్ చేయడం…అప్పటి పరిణామాలు బట్టి నిర్ణయం తీసుకుందామని ఇరువురి నేతల ఆలోచనగా తెలుస్తోంది. అయితే టీడీపీతో కలిసి వెళ్లే క్రమంలో బీజేపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అనుకూల పక్షమైన కొందరు నేతలు స్వాగతిస్తున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో వెళ్లేందుకు మెజార్టీ కేడర్ నిరాకరిస్తోంది. కానీ ఒకరిద్దరు నాయకులు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లు మూడు పార్టీలు కలిసే వెళతాయని ప్రకటించారు. చంద్రబాబు, పవన్ ల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు పార్టీల కలుస్తాయంటూ మనసులో మాటను బయటపెట్టారు. కొత్తచర్చకు అవకాశమిచ్చారు.

ఆ ఇద్దరి ప్రకటనలతో…
సత్యకుమార్ ఒక అడుగు ముందుకేసి మాట్లాడారు. జనసేన తమ మిత్రపక్షమైనా జనసేన ఒక స్వతంత్ర పార్టీగా పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏ పార్టీతో అయినా చర్చించవచ్చన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులను చూసి ఆయన కలత చెందారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఓట్లు చీలిపోకూడదన్నది పవన్ ప్రయత్నంగా చెప్పుకొచ్చారు. పవన్‌, చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదన్నారు. తిరోగమనంలో నడుస్తున్న రాష్ట్రాన్ని పురోగమనంలోకి తీసుకురావడంపై జనసేన, బీజేపీ చర్చిస్తున్నాయని వివరించారు. ఈ అంశాలపైనే పవన్‌, బాబు మధ్య చర్చలు జరిగి ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు. వైసీపీ చార్జిషీట్ కమిటీ అందులో భాగమేనన్నారు. ఇక మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాయని తేల్చిచెప్పారు.

తాజా పరిణామాలపై..
కానీ తాజా పరిణామాలపై బీజేపీలోని మెజార్టీ వర్గం గుర్రుగా ఉంది. అటు పవన్ నేరుగా చంద్రబాబుతో చర్చలు జరపడంపై ఆగ్రహంగా ఉంది. ఇటు బీజేపీ నాయకులు మీడియా ముందుకొచ్చి స్వాగతించడాన్ని కూడా తప్పుపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో కలిసి నడిచేందుకు రాష్ట్ర బీజేపీ ఇష్డపడడం లేదు. అయినా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ, ఎన్టీఏ విషయంలో తాను చేసిన వాటికి పశ్చాత్తాపం వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ చర్చలు జరపడం, మూడు పార్టీలు కలిసి నడుస్తాయని సొంత పార్టీ నాయకులే మీడియా ముందుకు రావడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు కుతకుత ఉడికిపోతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version