Dainik Bhaskar: మీడియా.. ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ఇప్పుడే జవాబుదారితనం మనగలుగుతుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇందులో మీడియా ఏమాత్రం లైన్ దాటినా మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ కూడా వెనుకటి రోజుల్లో జరిగేవి. కానీ ఇప్పుడు మీడియా అనేది భజన చేసేందుకు మాత్రమే.. ప్రజా సమస్యలు దేవుడెరుగు.. యాజమాన్యాల రాజకీయరంగుల్లో మీడియా దొర్లుతోంది. ఫక్తు వ్యాపారవస్తువుగా మారిపోయింది. ఇందులో ఈ మీడియా ఆ మీడియా లేదు.. ఏదో ఒక పార్టీతో అంట కాగడం.. వాటి ప్రయోజనాల ఆధారంగా రాతలు రాయడం పరిపాటిగా మారిపోయింది. ఇలా అడ్డగోలు రాతలు రాసి దేశంలోనే నెంబర్ వన్ పత్రిక “దైనిక్ భాస్కర్” క్షమపణ చెప్పింది. తప్పు జరిగిందని హైకోర్టు ముందు దోషిగా నిలబడింది.
వాస్తవానికి మీడియా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం అనేది అంత చిన్న విషయం కాదు. ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రతి అక్షరాన్ని పబ్లిష్ చేసేటప్పుడు ఒకటికి 1000 సార్లు ఆలోచించుకోవాలి. అని అదేం దరిద్రమో దైనిక్ భాస్కర్ మిగతా యూట్యూబ్ ఛానల్స్ లాగానే, వాట్సప్ పేపర్ ల లాగానే వ్యవహరిస్తోంది. అందుకే అది ప్రచురించిన ఒక నిర్లక్ష్య పూరితమైన వార్తకు మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఏది పడితే అది రాస్తే అది మీడియా స్వేచ్ఛ అనిపించుకోదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇష్టానుసారంగా రాసేస్తాం.. మమ్మల్ని అనేందుకు ఎవరికి ఎంత ధైర్యం. అనే పిచ్చి భరోసాలో గనుక తెలుగు పత్రికలు ఉంటే.. వాటికి కూడా ఇలాంటి వాతలు తప్పవు.
ఇక దైనిక్ భాస్కర్ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. బీహార్, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పై దాడులు జరుగుతున్నాయి. వారు హత్యకు గురవుతున్నారు. హిందీ మాట్లాడడమే ఇందుకు కారణమని ఆ వార్త సారాంశం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమిళనాడులో నివసించే లక్షలాదిమందిలో సదరు వార్త తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. వాస్తవానికి ఆ కార్మికులు అత్యవసరంగా తమ భాష మార్చుకోలేరు. మర్చి పోవడం సాధ్యం కాదు. నిజానికి తమిళనాడు వంటి హిందీ వ్యతిరేక రాష్ట్రంలో దైనిక్ భాస్కర్ రాసిన వార్త ఒక విధంగా సంచలనం రేకెత్తించింది. అయితే ఈ పత్రిక మీద తిరుపూర్ నార్త్, తిరునందర్వూర్ పోలీస్ స్టేషన్లో తమిళనాడు ప్రాంతాలకు చెందిన కొంతమంది ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా పత్రిక డిజిటల్ విభాగాలు చెందిన ఎడిటర్ ప్రసూన్ మిశ్రా మీద ఐపీసీ సెక్షన్ 153ఏ, 501 (1),(బి), 502(2) కింద అభియోగాల మోపారు. తమకు తమిళనాడు ప్రాంతం నుంచి రిపోర్టింగ్ చేసే విజయ్ సింగ్ భాగేల్ అక్కడ కొంతమందిని ఇంటర్వ్యూ చేసి, ఆ ఇన్పుట్స్ ఆధారంగా ఈ వార్త ఫైల్ చేశాడని, ఆ విలేఖరి మీద ఉన్న నమ్మకంతో ఈ వార్త ప్రచురించామని ప్రసూన్ మిశ్రా మద్రాస్ హైకోర్టులో వాదించాడు. తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శైలేంద్రబాబు ఒక సర్కులర్ జారీ చేసిన తర్వాత ఆ వార్తను నెట్ నుంచి తొలగించినట్టు మిశ్రా వివరించాడు. అయితే ఆ వార్త ఉద్దేశం వలస కార్మికులను ఇబ్బంది పెట్టడం, ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కాదని పేర్కొన్నాడు. వాస్తవానికి ఏ మీడియాలో అయినా అందులో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ఆ యాజమాన్యానికే బాధ్యత ఉంటుంది. ఎవరో రిపోర్టింగ్ చేశారు, ఇంకెవరో వార్త పెట్టారు అని అనడానికి వీల్లేదు. పబ్లిష్ అయ్యే మొత్తం కంటెంట్ కు కూడా యాజమాన్యానిదే జవాబు దారి. కాబట్టి హైకోర్టు సదరు పత్రిక సమర్థించుకునే వాదనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. చీవాట్లు పెట్టింది. చివరికి పత్రిక యాజమాన్యం కోర్టు ఎదుట మోకరిల్లింది. తప్పు జరిగిందని లెంపలేసుకుంది.
ఈ కేసు కు సంబంధించి జస్టిస్ ఏ డి జగదీష్ చాలా విస్పష్టమైన తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ” మీడియా అనేది ప్రజాస్వామ్య దేశానికి నాలుగవ స్తంభంగా ఉండాలి. సమాజంలో జరుగుతున్న సంఘటనలను అత్యంత ఖచ్చితత్వంతో చూపించాలి. రేటింగ్స్ కోసం, సర్క్యులేషన్ కోసం అడ్డదారులు తొక్క కూడదు. సంచలన వార్తల కంటే ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. వెంటనే క్షమాపణలు చెప్పండి. పత్రికలో మొదటి పేజీలో వివరణ పబ్లిష్ చేయండి. వెబ్ సైట్ హోం పేజీలో కూడా క్షమాపణ ప్రముఖంగా రావాలి” అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కోర్టు చెప్పినట్టు క్షమాపణ చెప్పిన తర్వాత దైనిక్ భాస్కర్ ఎడిటర్ మిశ్రాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, అవడి పోలీస్ కమిషనరేట్, తిరుపూర్ పోలీస్ స్టేషన్లో.. వరుసగా రెండు వారాలు రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరి మన తెలుగు నాట అడ్డగోలుగా వార్తలు ప్రచురించే ఓ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ కు ఇలాంటి నిబంధనలే విధిస్తే ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా పార్టీ రంగుల రాతలు చదివే దౌర్భాగ్యం తెలుగు పాఠకులకు తక్కుతుంది. ఆ… ఇప్పుడు ఆ పత్రికలను ఎవడు చదువుతున్నాడు? అందరూ సోషల్ మీడియానే ఫాలో అవుతున్నారు కదా? అని అంటారా? అది కూడా వాల్యుబుల్ ఆన్సరే!