Inhumanity in Rajasthan : అప్పులు పాలైన తండ్రులు తమ కూతుళ్లను అమ్ముకుంటున్నారు. కుల పంచాయితీ పెద్దల దుర్మార్గపు ఆదేశాలతో ఆడబిడ్డలను సంతలో పశువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అప్పులు తీర్చలేకపోతుండడంతో ఆ ఇంటి 8-18 ఏళ్ల బాలికలను కుటుంబాలు అమ్ముకోవాల్సి వస్తోందట.. ఒక వేళ అమ్ముకోకపోతే వారి తల్లులపై అత్యాచారాలకు పాల్పడాలని కులపెద్దలు తీర్పులు ఇస్తున్నారట.. కుల పంచాయితీ పెద్దల ఆదేశాలతో ఇవన్నీ రాజస్థాన్ లో జరుగుతున్నట్టు తేలింది. దీనిపై ఎన్.హెచ్ఆర్సీ సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది.
రాజస్థాన్ లో ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడానికి పోలీసుల వద్దకు వెళ్లకుండా అనేక గ్రామాల్లో కుల కౌన్సిళ్లు ఉన్నాయి. ఈ పంచాయితీ పెద్దలు ఆడపిల్లల అమ్మకాలు.. లేదంటే వారి తల్లులపై అత్యాచారాలు వంటి తీర్పులు ఇస్తున్న వైనం వెలుగుచూసింది.
15 లక్షలు అప్పు తీర్చలేకపోతున్న ఓ వ్యక్తి ఇటీవల కుల పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లి ఆ వ్యక్తి 12 ఏళ్ల కూతురిని అమ్మాలని తీర్పునిచ్చారు ఆ పెద్దలు. లేదంటే ఆయన భార్యపై అత్యాచారం చేయాల్సి ఉంటుందని దారుణ ఆదేశాలు ఇచ్చారట.. ఓ వ్యక్తి భార్య కు జబ్బు చేస్తే 6 లక్షలు అప్పు చేశాడు. అది తీర్చలేక తన బిడ్డను అమ్ముకున్నాడు. ఆమె ఇప్పటికే మూడు సార్లు చేతులు మారి నాలుగుసార్లు గర్భం కూడా దాల్చింది. అయినా తన భార్యను బతికించుకోలేదు. బిడ్డను కాపాడుకోలేదని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై ఎన్.హెచ్ఆర్.సీ స్పందించింది. రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదికను నాలుగు వారాల్లో అందించాలని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. పోలీసులకు కూడా నోటీసులిచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఎన్,.హెచ్ఆర్సీ రాజస్థాన్ లో పర్యటించి మూడు నెలల్లో నివేదిక రూపొందించేందుకు రెడీ అయ్యింది.
ఇలా అప్పుల కోసం ఆడబిడ్డలను అమ్మడం.. వారి తల్లులపై అత్యాచారాలు చేయించడం.. ఇంతటి ఆధునిక భారతంలోనూ ఇలాంటి జాఢ్యాలు వెలుగుచూడడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుల పెద్దలు తీర్పులు.. పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదీ మన భారతం అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.