
Gang Rape in Mumbai: ప్రభుత్వాలు ఎన్ని ధైర్యవచనాలు పలుకుతున్నా.. మహిళ భయం గుప్పిట్లోనే బతుకుతోంది. వ్యవస్థలు ఎన్ని చట్టాలు చేస్తున్నా.. మహిళలకు రక్షణ మాత్రం లభించట్లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కామాంధులకు అబలలు బలవుతూనే ఉన్నారు. తాజాగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటు చేసుకున్న దారుణ ఘటన గురించి వింటేనే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలపిస్తున్న ఈ గ్యాంగ్ రేప్ సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం చోటు చేసుకుంది. 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్డుతో చిత్ర హింసలకు గురిచేశారు. దీంతో.. బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టు మిట్లాడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునిచూడగా.. బాధితురాలు రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయి ఉంది.
దేశరాజధాని ఢిల్లీలో 2012లో ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ పారామెడికల్ విద్యార్థిని మిత్రుడితో కలిసి రాత్రివేళ బస్సులో ప్రయాణిస్తుండగా.. బస్సు డ్రైవర్ రామ్ సంగ్ సహా.. మొత్తం ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం పిచ్చి పట్టిన మృగాళ్లా వ్యవహరించిన దుండగులు.. జననాంగంలో ఇనుప రాడ్డు తో చిత్ర హింసలకు గురిచేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలికి సింగపూర్ లో చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలు దక్కలేదు.
ఇప్పుడు.. తాజాగా ముంబైలో జరిగిన దారుణం కూడా నిర్భయ ఘటనను గుర్తు చేసింది. దుండగులు. ఇనుప రాడ్డుతో బాధితురాలిని హింసించారని తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా.. ఈ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి.. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్టు సమాచారం. నిందితుడిపై 376, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, ఈ దారుణంలో ఇతనితోపాటు ప్రమేయం ఉన్న మరికొందరి కోసం పోలీసులు.. గాలిస్తున్నారు. నిందితుడిని విచారించిన అనంతరం మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.