Ganesh Chaturthi: ఈరోజు వినాయక చవితి పండుగ అనే సంగతి తెలిసిందే. గరికతో ఈరోజు పూజ చేస్తే ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. గరికపోచలంటే వినాయకునికి ఎంతో ఇష్టం. వినాయకునికి పత్రలు, పుష్పాలతో పూజలు చేసినా గరికను వినియోగించకుండా ఉంటే మాత్రం ఆ పూజ వ్యర్థం. వినాయకుడికి గరిక ఇష్టం కావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. చాలా సంవత్సరాల క్రితం అవలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్ని దహించసాగాడు.
ఆ సమయంలో దేవతలు వినాయకుడి దగ్గరకు వచ్చి మొర పెట్టుకోగా వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసున్ని మింగేశాడు. ఆ తర్వాత వినాయకుడిలో వేడి పెరగగా చంద్రుడు ఆ మంటను చల్లార్చే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు. పరమశివుడు పొట్ట చుట్టూ పామును కట్టినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత కొంతమంది ఋషులు 21 గరిక పోచలతో వినాయకుడికి వేడి తగ్గించవచ్చని చెప్పారు.
ఆ తర్వాత గరికతో తనను పూజించిన వారి కష్టనష్టాలను తీరుస్తానని వినాయకుడు చెప్పుకొచ్చారు. విఘ్నేశ్వరుడు ఉద్భవించిన రోజున వినాయక చవితిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వినాయకునికి ఉండ్రాళ్ళు, మోదకాలు నివేదించడం ద్వారా కోరుకున్న కోరికలను దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి ఎంతో ముఖ్యమైనది.
వినాయక చవితి పండుగ రోజున గణపతిని దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో ఆర్చించి 21 ఉండ్రాళ్లతో నివేదన చేస్తే గృహ దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. చంద్రోదయంతో చవితి తిథి ఉండి కృష్ణ చతుర్థి వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వినాయక చవితి రోజున ఉపవాసం చేసి ‘ఓం శ్రీ గణేశాయ నమ’ అనే మంత్రాన్ని జపించి పూజ జరిపించాలని పురోహితులు చెబుతున్నారు.