
Amritpal Singh: “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మమ్మల్ని ఏమీ చేయలేరు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే వారికీ పడుతుంది” ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేసిన అమృత్ పాల్ సింగ్ పోలీసులకు ఎలా చిక్కాడు? మార్చి 18 నుంచి అజ్ఞాతంలో ఉన్న అతడు ఒక్కసారిగా పంజాబ్ లోని మొగా జిల్లా, రోడే గ్రామంలో గురుద్వారా లో ఎందుకు పోలీసులకు లొంగిపోయాడు? నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది.
అమృత్ పాల్ సింగ్ ఆచూకీకి సంబంధించి కీలకమైన సమాచారం అతడి మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే పోలీసులకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.. రోడే గ్రామంలో లొంగిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టగానే ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా అమృత్ పాల్ జస్బీర్ కు చెప్పాడు.. దీంతో శనివారం గురుద్వారాకు చేరుకోవాలని జస్బీర్ అమృత్ పాల్ కు సూచించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే అతను ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా పోలీసులకు చెప్పాడు..అమృత్ పాల్, తన అనుచరుల సమక్షంలో లొంగిపోవాలని ప్రయత్నిస్తున్నట్టు వివరించాడు.. అయితే ఇక్కడే పోలీసులు బుర్ర పాదరసంలా పని చేసింది.. అనుచరుల సమక్షంలో అమృత్ పాల్ లొంగిపోతే మరో అజ్నాలా వంటి ఘటన జరగవచ్చని పోలీసులు అనుమానించారు. జస్బీర్ చెప్పిన మాటలు నమ్మినట్టే నమ్మి..గురు ద్వారా ను చుట్టుముట్టారు.
అయితే అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ లో తన పాత్ర ఏమీ లేదని జస్బీర్ చెప్తున్నాడు. “శని వారం రాత్రి గురుద్వారాకు చేరుకున్న అమృత్ పాల్ సింగ్ స్వయంగా పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతోపాటు తన వెంట తెచ్చుకున్న కిట్ లో దుస్తులను మార్చుకొని గురుద్వారలో ప్రార్థనలు నిర్వహించాడు. అనంతరం అతడు బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేశారని” జస్బీర్ సింగ్ విలేకరులకు వెల్లడించాడు.

అయితే అమృత్ పాల్ సింగ్ సహాయకుడు పపల్ ప్రీత్ అరెస్ట్ కావడంతోనే అతనిపై ఒత్తిడి పెరిగిపోయిందని తెలుస్తోంది. అమృత్ పాల్ సింగ్ కు అవసరమైన షెల్టర్, ఆహారం, నిధులను పపల్ ప్రీత్ సింగ్ సమకూర్చాడు. అంతేకాదు అత్యంత కీలకమైన సలహాదారుడు కూడా వ్యవహరించాడు. మరోవైపు అకాల్ తక్త్, సిరోమణి ద్వారా ప్రబంధక్ కమిటీ అమృత్ పాల్ అనుచరులను పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. దీంతో అమృతపాల్ సింగ్ లో ఆలోచన మొదలైంది.. దీనికి తోడు అకాల్ తక్త్ చీఫ్ జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్ కూడా అమృత్ పాల్ ను లొంగి పోవాలని సూచించాడు. దీంతోపాటు “సర్బత్ ఖల్సా” నిర్వహించాలనే డిమాండ్ ను తోసిపుచ్చాడు. ఇలా అన్ని రకాలుగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో అమృత్ పాల్ ఒంటరి అయిపోయాడు. తన ప్రధాన అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. అతడిలో భయం మొదలైంది.
అకాల్ తక్త్ చీఫ్ కు కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అమృత్ పాల్ లొంగిపోని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా వచ్చాయి. దీంతో ఇది మొదటికే మోసం వస్తుందని భావించిన అకాల్ తక్త్ చీఫ్ వెంటనే అమృత్ పాల్ సింగ్ కు వర్తమానం పంపారు. లొంగిపోని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.. ఈ క్రమంలోనే పోలీసులు అమృత్ పాల్ సింగ్ కదలికలపై నిఘా పెట్టారు. రోడే గ్రామంలో గురుద్వారాలో అమృత్ పాల్ సింగ్ ఉన్నట్టు గుర్తించారు. అయితే పోలీస్ యూనిఫాంలో అందులోకి వెళ్ళడం సరికాదు కనుక.. గురు ద్వారా ను చుట్టు ముట్టి అమృత్ పాల్ సింగ్ కు మైకు ద్వారా హెచ్చరికలు పంపారు. అతడు బయటికి రాగానే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు అస్సాంలోని దిబ్రూగడ్ జైల్ లో ఉన్నాడు. అతని అనుచరులను కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అక్కడికే తరలించారు.