
Ganga Pushkaralu: మన దేశంలో పన్నెండు జీవ నదులు ఉన్నాయి. వీటిలో గంగా ముఖ్యమైనది. గంగానదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నదికి కూడా పుష్కరాలు వస్తుంటాయి. అలాగే గంగానదికి ఏప్రిల్ 22, 2023లో పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవి పన్నెండు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. అందుకే గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు.
బ్రహ్మ విష్ణుశ్చ రుద్రాశ్చ ఇంధ్రాద్య సర్వ దేవతా పితరో రుషా యస్వి యావ తత్తైవ నివసంతి హీ అనే శ్లోకం ప్రకారం పుష్కర సమయంలో వార్షిక పిండదానం, పెద్దలకు తర్పణం, అనేక కర్మలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుందని చెబుతుంటారు. గంగా పుష్కరాలు జరిగే పవిత్ర పుణ్య క్షేత్రాలలో గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి (కాశీ), రుషికేశ్, అలహాబాద్ లలో గంగా స్నానం చేయొచ్చు.

కాశీ నాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నానఘట్టాలు ఉన్నాయి. వీటిలో మణికర్ణిక ప్రధానమైనది. దీంతో గంగలో స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధతో చేయాలి. నది పవిత్రతను కాపాడుతూ స్నానం ఆచరించాలి. పుష్కర స్నానం చేసేటప్పుడు శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మట్టితో పార్థివ లింగాన్ని తయారు చేసి తర్పణాలు వదలాలి.
గంగా పుష్కరాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి స్నానం చేసి పెద్దలకు తర్పణం వదులుతారు. ఈ సమయంలో పెద్దలను తలుచుకుని తర్పణాలు పెడితే వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం. ఇలా గంగానది పుష్కరాల్లో స్నానమాచరించి పుణీతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.