Karpoori Thakur: గణతంత్ర దినోత్సవం వేళ భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, వెనుకబడిన వర్గాల నాయకుడు, కర్పూరి ఠాకూర్‌కు భారతరత్నను కేంద్రం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ శత జయంతి వేళ ఆయనకు దేశ అత్యున్నత గౌరవం దక్కింది.
కర్పూరి ఠాకూర్ నేపథ్యం..
బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరి ఠాకూర్ 1924, జనవరి 24న జన్మించారు. 1970, డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు బిహార్ సీఎంగా సేవలు అందించారు. 1977 నుంచి 1979 వరకు మరోమారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతీయ క్రాంతిదళ్, జనతా పార్టీల్లో సేవలందించారు. జననేత, జననాయక్‌గా బిహార్‌లో ప్రసిద్ధి చెందిన కర్పూరి ఠాకూర్ 1988, ఫిబ్రవరి 17న కన్నుమూశారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో..
బ్రిటిష్ ఇండియాలో బిహార్ – ఒడిశా ప్రావిన్స్‌లోని పితౌజియా’పస్తుతం కర్పూరి గ్రామ్)లో అతి సామాన్య కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 26 నెలలు జైల్లో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
సోషలిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పూర్ నియోజకవర్గం నుంచి కర్పూరి ఠాకూర్ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచి శాసన సభలో అడుగు పెట్టారు. బిహార్‌కు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మెట్రిక్యులేషన్ లో ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరి జాబితా నుంచి తొలగించారు. మద్యపాన నిసేధం అమలు చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యా వికాసానికి కృషి చేశారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి..
కర్పూరి ఠాకూర్ తొలుత గాంధీజీ ఆలోచనల్ని ప్రచారం చేసినా.. తర్వాత సైద్ధాంతికంగా ఆయనతో విభేదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేశారు. రామ్‌మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా ఠాకూర్ చాలాకాలం పనిచేశారు. దేశంలో భూస్వాముల వద్ద, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం సాధిస్తుందని, తద్వారా దేశం పురోగమిస్తుందని నమ్మారు. జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఠాకూర్‌ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు.
లాలూ, నీతీశ్‌లకు గురువు..
జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితుడిగా ఉన్న ఠాకూర్ తర్వాత జనతాపార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అగ్రకులాల ఆధిపత్యం ఉన్న బిహార్ రాజకీయాల్లో ఓబీసీ రాజకీయాలకు ఠాకూర్ పునాది వేశారు. జేపీ ఇచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ఉద్యమంలోకి రాగా అలా వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశ్వాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. బిహార్‌లో ఓబీసీలతో పాటు ఎంబీసీలూ ఎదగాలని ఆయన భావించారు. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితం కోసం పనిచేశారు.