Farmer Laws To Agneepath: మొన్నటి వరకు వ్యవసాయ చట్టాలు.. ఇప్పుడు అగ్నిపథ్ పథకం.. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీటిపై తిరుగుబాటు ఎందుకు వస్తోంది..? ఈ రెండు రైతులు, అభ్యర్థులకు ఉపయోగకరమే అని చెబుతున్నా.. వారు ఆందోళన చేయడానికి కారణం ఏంటి..? కొందరు బీజేపీ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా నిరసన తెలుపుతున్నారని అంటున్నారు.. మరి అలాంటప్పుడు వాటిని విడమర్చి ప్రజలకు చెప్పే అవకాశం లేదా..? లేక ప్రజలతో తమకేం సంబంధం అంటూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందా..? అనే చర్చ హాట్ టాపిక్ గా సాగుతోంది. సాగు చట్టాల గురించి రైతులు ఆందోళన చేసేవరకు వాటి గురించి ఎవరికీ తెలియదు.. అలాగే ఇప్పుడు అగ్నిపథ్ గురించి ఇన్నర్ గా చర్చ జరపడమే గానీ.. ఆ పథకం గురించి వివరించిన సందర్భాలు లేదు.. అందుకే ఇలా గేర్ రివర్స్ అవుతుందా..? అని అంటున్నారు.

వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ, అదానీ లాంటి వ్యక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తిరుగుబాటు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు తమకు అన్యాయమే చేస్తాయని ఉత్తరాదికి చెందిన రైతులు ఏడాదిపాటు ఢిల్లీలో ఉంటూ నిరసన తెలిపారు. అయితే రైతులు ఆందోళన మొదలు పెట్టేవరకు సాగు చట్టాల గురించి కేంద్రం బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కనీసం వాటి గురించి అవగాహన కల్పించలేదు. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెబుతున్నా.. వాటిని విడమరిచి చెప్పే సమయం లేదా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజలతో.. ప్రతిపక్షాలతో చర్చించకుండా హూటాహుటిన రెండు సభల్లో బిల్లులు ఆమోదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా రైతుల దెబ్బకు కేంద్రం వెనుకడుగు వేయాల్సి వచ్చింది.

Also Read: Pavan Alliance With People: జనంతో నే పవన్ పొత్తు.. బీజేపీకి దారేది?
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ కేంద్రం ప్రవర్తన అదే విధంగా ఉందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మూడేళ్ల ముందు నుంచి ఈ పథకం గురించి ఇన్నర్ గా చర్చిస్తున్నారే తప్ప.. బహిరంగ ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించిన సందర్భాలు లేవు. అగ్నిపథ్ గురించి సొంత పార్టీలతో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకొని ఇప్పడు నియామకాల వరకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న వారికి తాత్కాలిక నియామకాలు అనేసరికి అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అసలే కరోనాతో రెండేళ్లు వృథా అయ్యాయి. దీంతో ఇప్పుడు తాత్కాలిక నియామకాలు అనేసరికి మరింత ఆందోళన వ్యక్తం అయింది.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా వెళ్లకుండా ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అగ్నిపథ్ పథకం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తే మంచి పథకమే. కానీ దాని గురించి అభ్యర్థులకు సరైన విధంగా అవగాహన కల్పించడంలో విఫలమైందని అంటున్నారు. ఇటీవల ఆందోళన జరిగిన తరువాత ఇప్పుడు అగ్నిపథ్ గురించి వివరిస్తున్నారు. అయితే ముందే ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే.. రైల్వే ఆస్తులు కోల్పోవాల్సి వచ్చేది కాదని అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రజల మేలు కోరే పథకాలు ప్రవేశపెడుతున్నామని భావిస్తున్నా.. వాటిపై ప్రజల వాయిస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.