Womb Of The AP Sea: ‘చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని.. బాలమిత్ర కథలో చదివా పగటపు దీవులు ఉంటాయని.. నమ్మడానికి ఎంతో బాగుందో’.. ఓ సినీ కవి రచన ఇది. ఇందులో రెక్కల గుర్రాల వరకూ చెప్పలేం కానీ. పగటపు దీవులు, దిబ్బలు ఉన్నాయని నమ్మవచ్చు. మీకు నమ్మశక్యం లేదు కదూ. కానీ ఇది నిజమేనట. విశాఖ, విజయనగరం సాగర తీరాల మధ్య ఇవి ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతుండడం విస్తుగొలుపుతోంది. సాగర గర్భంలో లక్షలాది జీవిరాశులతో పాటు అబ్బురపరిచే మొక్కలు, పగడపు దిబ్బలు ఉంటాయి. భూమ్మీద ఎక్కడా కనిపించని అత్యంత అందంగా ఉంటుంది సాగర గర్భం. ఐతే ఇవన్నీ సినిమాల్లోనో ఇప్పటివరకూ చూశాము. కానీ అత్యంత అరుదైన, విభిన్నమైన పగడపు దిబ్బలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సుదీర్ఘమైన సముద్ర తీరమున్న ఏపీలో చాలా చోట్ల పగడపు దిబ్బలున్నాయట. ముఖ్యంగా అందమైన విశాఖపట్నం తీరానికి అతిదగ్గర్లోనే వీటిని గుర్తించారు. ఏపీ కోస్తా తీరంలో పగడపు దిబ్బలుండవనే మాట తప్పని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిరూపించింది.
సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం.ఇప్పటివరకూ అపార మత్స్య సంపదను మాత్రమే ఉన్నట్టు తెలుసు. అటువంటి తీరంలో పగడపు దిబ్బలు ఉన్నాయని తెలుస్తుండడం ఆశ్చర్యం వేస్తోంది. తీరంలోని ఒకే ప్రాంతంలో వివిధ రకాల కోరల్స్ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఆ పగడపు దిబ్బలను మరోచోటుకి తరలించి అభివృద్ధి చేయడం కూడా సాధ్యమని తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాలోని పూడిమడక తీరం నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు జరిపిన సర్వేలో విభిన్న జాతుల కోరల్స్ జాడ లభించింది. ఏపీ కోస్తా తీరంలో దాదాపు మూడేళ్ల పాటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు జరిపింది.శాస్త్రవేత్తలు పూడిమడక, రిషికొండ, భీమిలి, యారాడ, కైలాసగిరి, ఆర్కే బీచ్, మంగమూరి పేట, సాగర్ నగర్, తెన్నేటి పార్క్, చింతపల్లి బీచ్ ప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రాంతాలను సర్వే పాయింట్లుగా గుర్తించి.. 30 మీటర్ల లోతులో అంటే దాదాపు వంద అడుగుల లోతులో సర్వే చేశారు. విశాఖలోని స్కూబా డైవింగ్ సంస్థ అయిన లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తలు చేపట్టిన సర్వేల్లో పూడిమడక వద్ద పగడపు దిబ్బల ఆఛూకీ లభ్యమైంది.
ఈ సర్వేలో అరుదైన కోరల్స్ జాడను కనుక్కున్నట్టు తెలిసింది. ముఖ్యంగా డిస్కోసోమా, లోబాక్టిస్, హెక్సకోరిలియా, ఆక్టోటోరిలియా, పపోనాఎస్పీ, స్కెలరాక్టినియా కోరల్స్, లిథోపిలాన్ ఎస్‌పీ, మోంటీపోరా ఎస్‌పీ, పోరిటెస్ ఎస్‌పీ వంటి కోరల్స్ జాడ లభ్యమైంది. ఐతే వీటిలో కొంతభాగం తీసి మరోచోట పెంచే రకాలు అరదుగా ఉంటాయని.. అలాంటి కోరల్స్ పూడిమడకలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇందులో మరో విశేషమేటంటే.. ఈ కోరల్స్ మందుల తయారీకి కూడా ఉపయోగపడతాయని వెల్లడించారు. పరిశోధనల్లో భాగంగా విశాఖ తీరంలో 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్‌లు, 12 అసిడియన్‌లు, 3 ఫ్లాట్ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్ వంటి జీవరాశుల నమూనాలను సేకరించారు. ఈ పగడపు దిబ్బలు మత్స్య సంపద వృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అయితే ఈ పరిశోధనలను అభివ్రద్ధి చేస్తే సాగర నగరం ప్రపంచ పుటల్లోకి ఎక్కడం ఖాయం. ఇప్పటికే పర్యాటకంగా నగరం గణీయమైన అభివ్రుద్ధి సాధించింది. తాజాగా పగడపు దిబ్బలు వెలుగుచూడడంతో మరింత ఆసక్తి గొల్పడం ఖాయం. ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశముంది. మరోవైపు ఉమ్మడి విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతాలను అభివ్రుద్ధి చేసే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.
Also Read: Janasena Alliance: జనంతోనే పొత్తు.. బీజేపీ, టీడీపీకి షాకిచ్చిన పవన్ కళ్యాణ్