Delhi Liquor Scam: రేపు చేస్తారు, నేడు చేస్తారు, త్వరలో చేస్తారు, ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు సంబంధించి మీడియాలో జరిగిన చర్చలు.. కవిత అరెస్టుపై మొన్నటిదాకా. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా కవిత వేసిన పిటిషన్ తాలూకూ కేసు సుప్రీంకోర్టు(supreme court) పరిధిలో ఉండటం.. మార్చి 19 వరకు ఆ కేసు విచారణలో ఉండటంతో.. కవిత అరెస్టు కాదని భారత రాష్ట్ర సంపి నాయకులు ధైర్యంగా ఉన్నారు. చివరికి కవిత కూడా తనను అరెస్టు చేయలేరంటూ ధీమాతో ఉన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కవితను అరెస్టు చేసింది. శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించింది.. శనివారం కోర్టు ముందు హాజరుపరిచింది. తర్వాతి పరిణామాలు ఏం జరుగుతాయో తెలియదు కానీ.. కవితకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) అత్యంత గోప్యంగా ఉంచుతోంది. నిజానికి గత ఏడాది నుంచి కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెండు మూడుసార్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) అధికారుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే..
గత ఏడాది ఇదే నెలలో ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆమెను అరెస్టు చేశారు. గత ఏడాది మార్చి 11న ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కార్యాలయంలో కవితను ఏడు గంటలపాటు విచారించారు. అంతకంటే ముందు అంటే మార్చి 9న ఆమెకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) సమన్లు పంపింది. మార్చి 11 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) అధికారుల బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. విజయ్ నాయర్, అరుణ్ రామచంద్ర, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి.. వంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్లను కవిత ముందు ఉంచారు. వాటి ఆధారంగా ప్రశ్నలు అడిగి.. కవిత నుంచి సమాధానాలు రాబట్టారు. “స్వల్ప వ్యవధిలోనే 10 ఫోన్లు ఎందుకు మార్చారు? వాటిని ఎందుకు ధ్వంసం చేశారు” అని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రశ్నించింది. అదే సమయంలో కవిత వాడుతున్న ఫోన్ ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కవిత విచారణకు హాజరు కాలేదు. తనను ఇంటి వద్ద విచారించాలంటూ నళిని చిదంబరం కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) విచారణకు బ్రేక్ పడింది. అంతకుముందు 2022 డిసెంబర్ 11న కూడా సిబిఐ కవితను విచారించింది. ఇక గత నెల 26న కవితను నిందితురాలుగా పేర్కొంటూ విచారించాలని 41-A కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) నోటీసులు జారీ చేసింది.” నన్ను విచారించే విషయమై ఇప్పటికే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఎన్నికల సమయంలో నేను తీవ్రమైన పనిలో ఉన్నాను. విచారణకు హాజరు కాలేనని”ఆమె లేఖ రాశారు.
ఏడాది నుంచి ఏం జరిగిందంటే
ఢిల్లీలో మద్యం కుంభకోణం పై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టు 17న సిబిఐ (Central bureau of investigation) ఎఫ్ఐఆర్ నమో చేసింది. అనంతరం నాలుగు రోజులకు ఆగస్టు 23న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇక అదే ఏడాది నవంబర్ 25న తొలి ఛార్జ్ షీట్ దాఖలైంది. 2021 జూన్ నెలలో హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నాయకులు సౌత్ గ్రూప్ పేరుతో ఢిల్లీ రాజకీయ నాయకులతో కలిపి లావాదేవీలు నిర్వహించారని అందులో పేర్కొంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరఫున వినయ్ నాయర్ మొత్తం వ్యవహారం నడిపించారని పేర్కొన్నది.
దొడ్డి దారిన..
సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం అడ్డగోలుగా సంపాదించేందుకే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. హోల్ సేల్ గా 12 శాతం లాభాలు, రిటైల్ గా 185 శాతం లాభాలు ఆర్జించాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఢిల్లీలో హోల్ సేల్ వ్యాపార సంస్థ అయిన ఇండో స్పిరిట్ గ్రూప్ నకు 65 శాతం వాటా కేటాయించేందుకు అంగీకరించారు. ఇందులో సౌత్ గ్రూప్ నకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 రిటైల్ జోన్లు కేటాయించారు. 2021 జనవరిలో హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్లో కవిత బినామీగా భావిస్తున్న అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్ నాయర్ తో భేటీ అయ్యారు. కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉండగా.. వారికి అరుణ్, బుచ్చిబాబు, అభిషేక్ సౌత్ గ్రూప్ తరపున ప్రతినిధులుగా వ్యవహరించారు. 2021 జూలై – సెప్టెంబర్ మధ్య 30 కోట్లు హవాలా రూపంలో మళ్ళించారు.
2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలో మద్యం ఉత్పత్తిదారు ఫెర్నార్డ్ ఇచ్చిన డిన్నర్ కు అభిషేక్, అరుణ్ రామచంద్ర, శరత్ చంద్రా రెడ్డి హాజరయ్యారు. 2022 ఏప్రిల్ 8న కవిత, అరుణ్ రామచంద్ర కలిసి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో విజయ్ నాయర్, దినేష్ ఆరోరాను కలిసి తమకు రావలసిన డబ్బుల గురించి చర్చించారు. ఇక ఈ వ్యవహారంలో 2022 సెప్టెంబర్ నుంచి అరెస్టులు ప్రారంభమయ్యాయి. మొదట ఇండోస్ పిరిటి యజమాని సమీర్ మహేంద్రు, నవంబర్లో శరత్ చంద్ర రెడ్డి, బినయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ ఆరోరా అరెస్టయ్యారు. 2023 ఫిబ్రవరి 22న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిషి సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. 2023 జూన్ లో శరత్ చంద్రా రెడ్డి, సెప్టెంబర్లో మాగుంట రాఘవరెడ్డి, దినేష్ ఆరోరా అప్రూవర్లుగా మారారు. కవిత అరెస్టు తర్వాత ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది.. అతడికి ఉచ్చు బిగించాలంటే కవిత అరెస్టు తప్పనిసరి కావడంతో..ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) అధికారులు ఆమెను అరెస్టు చేసినట్టు సమాచారం.