Emergency Alert: మీ మొబైల్‌కి ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చుంటుంది. కంగారు పడొద్దు. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్‌లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి, భయాందోళనలకు గురయ్యారు. ఈ మెసేజ్‌తోపాటు పెద్దగా బీప్ సౌండ్ కూడా రావడంతో మొబైల్ యూజర్ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో..? ఎందుకు వచ్చిందో..? ఎవరు పంపారో..? తెలియక అంతా గందరగోళానికి గురయ్యాయి. తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సైతం ఒక్క నిమిషం టెన్షన్ పడ్డారు. తను ఒక సమావేశంలో మాట్లాడుతుండగా ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రావడంతో తన ప్రసంగం ఆపేశారు. వెకేట్ చేయమంటారా అని అడిగారు. తర్వాత విషయం తెలిసి నవ్వుకున్నారు.
పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్..
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది.నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.
మొట్టమొదటి సారిగా..
రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా మంది యూజర్లపై సిస్టమ్ పనితీరును టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే యూజర్లకు సెక్యూరిటీ మెసేజ్ అలర్ట్ పంపుతోంది. విపత్తుల గురించి ప్రజలను హెచ్చరించేందుకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి వ్యవస్థనే అమల్లోకి తెచ్చేప్రయత్నం చేస్తోంది. భూకంపాలు, ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు, సునామీలు, ఇతర విపత్తులేమైనా వచ్చినప్పుడు ప్రజలను తక్షణమే అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషన్ విభాగంలోని సెల్ బ్రాడ్‌కాస్టింగ్ మొబైల్ యూజర్లకు టెస్ట్ మెసేజెస్ పంపుతోంది.