రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ట్రైన్ లో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇ క్యాటరింగ్ సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఇ క్యాటరింగ్ సర్వీసుల ద్వారా ఎక్కువగా రైళ్లలో ప్రయాణం చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇండియన్ రైల్వేస్ సిబ్బంది లభ్యత, స్థానిక పరిమితులను బట్టి నచ్చిన ఫుడ్ పొందే అవకాశం కల్పించనుంది.
ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే మొదట ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఫుడ్ ఆర్డర్ చేయాలనుకునే ప్రయాణికులు రైల్ రెస్ట్రో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో ప్రయాణికులు సీటు వివరాలు, పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గతంలో రైల్వే శాఖ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
అయితే లాక్ డౌన్ తరువాత పరిమిత సంఖ్యలో రైళ్లు అందుబాటులోకి రాగా రైల్వే శాఖ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇ క్యాటరింగ్ సర్వీసులకు సంబంధించి రైల్వే శాఖ రైల్ రెస్ట్రోకు అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల చివరి వారం నుంచి రైల్ రెస్ట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైల్ రెస్ట్రో రెస్టారెంట్ పార్ట్‌నర్స్ కు కాంటాక్ట్ లెస్ డెలివరీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ సర్వీసులను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇ క్యాటరింగ్ సర్వీసులను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురావడంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.