
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఉత్సవ్ నడుస్తోంది. ముందుగా 65 ఏండ్ల పైబడి వృద్ధులకు.. ఆ తదుపరి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయగా.. వచ్చే ఫస్ట్ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు సహా.. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ స్టార్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
అయితే… దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నడుస్తున్నా చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడంలేదు. ప్రజల్లో ఇంకా ఇప్పటికీ భయాందోళనలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాలకులు ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇప్పటివరకు దేశంలో 13,01,19,310 మందికి వ్యాక్సిన్ వేశారు.
ఇప్పటివరకు దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు మాత్రమే వేస్తున్నారు. ఈ రెండు టీకాలకు మాత్రమే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు కూడా అనుమతి లభించింది. కానీ.. ఇంకా అది భారత్‌లో అందుబాటులోకి రాలేదు.
ఇదిలా ఉంటే.. బహిరంగ మార్కెట్లోకి టీకా రానుంది. అయితే.. అది ఫ్రీగా మాత్రం కాదు దానికి కూడా ఓ రేటు ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటి నుంచి ప్రజలు టీకా కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధరను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్ధారించింది. ఒక్కో డోసు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 400 రూపాయలు వసూలు చేయబోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.600 వసూలు చేస్తారు. కాగా.. ఇతర దేశాల్లో ఉన్న రేట్ల కంటే తక్కువకే కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పునావాలా వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు 45 ఏళ్లు పైబడి ఉండాలనే నిబంధనను కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఎవరైనా టీకా వేయించుకోవచ్చన్నమాట.